పాక్ ఐఎస్ఐకు గూఢచర్యంలో నెలలో 15 మంది అరెస్ట్

పాక్ ఐఎస్ఐకు గూఢచర్యంలో నెలలో 15 మంది అరెస్ట్
 
* ఉగ్ర లింకులపై ఎన్ఐఏ ఏడు రాష్ట్రాల్లో సోదాలు

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్‌ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్‌ ఐఎస్‌ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో కనీసం 15 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొన్నాయి.

నిందితులు రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, పంజా బ్‌ తదితర రాష్ర్టాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో జ్యోతిమల్హోత్రా (యూట్యూబర్‌), మోతీరామ్‌ జాట్‌ (సీఆర్పీఎఫ్‌ జవాన్‌),  సహదేవ్‌సింగ్‌ (హెల్త్‌ వర్కర్‌), దేవేందర్‌ సింగ్‌ (పీజీ స్టూడెంట్‌),  నౌమన్‌ (సెక్యూరిటీ గార్డు),  షాకూర్‌ ఖాన్‌ (ప్రభుత్వాధికారి),  కాసీమ్‌ (సిమ్‌కార్డుల విక్రయదారి), షాహ్‌జాద్‌ (బిజినెస్‌మ్యాన్‌),  ముర్తాజా అలీ (టెకీ) ఉన్నారు. ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులు పాక్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్టు అధికారులు పేర్కొన్నారు.

డబ్బులకు ఆశపడి కొందరు, హనీట్రాప్‌లో పడి మరికొందరు.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్టు వారు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు నుంచే ఈ గూఢచర్యం కొనసాగుతున్నదని, దాన్ని గుర్తించడంలో కేంద్రం వైఫ ల్యం చెందిందని నిపుణులు విమర్శిస్తున్నారు. భద్రతాపరమైన లోపాలు చోటుచేసుకొన్న మాట వాస్తవమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే ఒప్పుకున్నారు.

ఇలా ఉండగా, రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్‌ ఇంజినీరుగా పని చేస్తున్న రవీంద్ర వర్మ (27)ను మహారాష్ట్ర పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఆయన పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనను యాంటీ టెర్రరిజం స్కాడ్‌ కస్టడీకి అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం, థానేలోని కల్యాణికి చెందిన రవీంద్ర వర్మకు 2024లో ఫేస్‌బుక్‌ ద్వారా పాకిస్థాన్‌ ఏజెంట్లు పాయల్‌ శర్మ, ఇస్ప్రీత్‌లతో పరిచయమైంది. 

వారిద్దరూ తాము భారత్‌కు చెందినవారమని పరిచయం చేసుకున్నారు. ఓ ప్రాజెక్టు కోసం యుద్ధ నౌకల సమాచారం కావాలని వర్మను కోరారు. వర్మ వారి వలపు వలలో చిక్కుకున్నాడు. దక్షిణ ముంబైలోని నావల్‌ డాక్‌ యార్డుకు వెళ్లేందుకు, నౌకాదళ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో ప్రయాణించేందుకు ఆయనకు అవకాశం ఉంది.  ఈ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసి, యుద్ధ నౌకలతోపాటు జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆ పాక్‌ ఏజెంట్లకు చేరవేశాడు. అందుకు బదులుగా వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పొందాడు.

మరోవంక, ఉగ్రవాదులతో లింక్‌లు ఉన్నాయన్న అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 15 చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, అస్సాం రాష్ర్టాల్లో ఈ దాడులు జరిపింది. పాకిస్థాన్‌ హ్యాండ్లర్లకు సున్నిత సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణపై సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఒక వ్యక్తిని ఇటీవల అరెస్ట్‌ చేసింది 

 
ఈ క్రమంలో అనుమానిత నగదు లావాదేవీలు వెలుగులోకి రావడంతో కోల్‌కతాలో ఒక ట్రావెల్‌ కార్యాలయం సహా మూడు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు జరిపింది. కనీసం మూడు సార్లు ఈ ట్రావెల్‌ సంస్థ నుంచి అనుమానాస్పద నగదు బదిలీ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దాని యజమాని మహమ్మద్‌ మసూద్‌ అలమ్‌కు సమన్లు జారీ చేసి సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.