
ఆపరేషన్ సిందూర్ దేశచరిత్రలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద, విజయవంతమైన ఆపరేషన్ అని చెప్పారు. సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. నారీశక్తి దేశభద్రతకు కవచంగా మారిందని ప్రశంసించారు. దేశరక్షణలో మహిళల సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇందుకోసం గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు.
“నౌకాదళానికి చెందిన ఇద్దరు మహిళలు 250 రోజుల సముద్ర యాత్రను పూర్తిచేశారు. సవాల్ ఎంత పెద్దదైనా భారత మహిళలు విజయం సాధిస్తారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కానీ సీమాంతర ఉగ్రవాదం కానీ నేడు భారత మహిళలు దేశభద్రతకు కవచంగా మారారు. దేవీ అహల్య పవిత్రభూమి నుంచి దేశంలోని నారీశక్తికి మరోసారి సెల్యూట్ చేస్తున్నాను” అని మోదీ తెలిపారు.
దేవి అహల్యాబాయి దేవుని ఆరాధనకు, ప్రజల సేవకు ఎలాంటి భేదం చూపలేదని ప్రధాని మోదీ చెప్పారు. ఆమె పేదల జీవితాల్లో పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. కాశీలో సేవ చేసే అవకాశం నాకు లభించడం సంతోషకరమని పేర్కొంటూ అక్కడే అహల్యాబాయి అభివృద్ధి పనులకు మొదట పునాది వేశారని మోదీ గుర్తు చేసుకున్నారు.
ఆమె మహిళలను చేనేత రంగంలో శక్తివంతం చేశారని, నీటి సంరక్షణతో రైతులు ఎక్కువ ఆదాయం పొందేలా సహాయపడ్డారని వెల్లడించారు. స్త్రీలకు కూడా ఆస్తి హక్కులు ఉండాలని, భర్తలు అకాల మరణం చెందినా కూడా తిరిగి వివాహం చేసుకోవచ్చని అహల్యా ఆ కాలంలో చెప్పారని మోదీ వివరించారు.
అహల్యాబాయి గిరిజన సమూహాల కోసం కూడా కృషి చేశారని, వారికి వ్యవసాయ భూములు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడ్డారని ప్రధాని పేర్కొన్నారు. జూనాగఢ్ నుంచి కుటుంబాలను మహేశ్వర్‌కు తీసుకొచ్చి, మహేశ్వరీ చీరల తయారీలో నైపుణ్యం నేర్పించారని చెబుతూ ఇది ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉందని మోదీ తెలిపారు.
అహల్యాబాయి అభివృద్ధి, పురోగతికి చిహ్నమని, ప్రజలు ఇచ్చిందే మనకు సొంతమని ఆమె చెప్పారని మోదీ ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సరఫరా, వైద్య సంక్షేమ పథకాల ద్వారా సమాజ పురోగతి కోసం కృషి చేస్తోందని మోదీ భరోసా ఇచ్చారు. గతంలో మహిళలు తమ అనారోగ్యాలను దాచుకునేవారని, తమ కుటుంబంపై భారం కాకూడదని భావించేవారని చెప్పారు.
కానీ, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం పొందుతున్నారని మోదీ చెప్పారు. మూడు కోట్ల మహిళలను లఖ్‌పతి దీదీలుగా చేస్తామని తాము వాగ్దానం చేశామని, ఆ దిశగా వేగంగా పురోగమిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వేలాది మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై ఉన్నారని వెల్లడించారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు