అందాల పోటీల పేరుతో వెకిలి చేష్టలకు ప్రభుత్వ ప్రోత్సాహం!

అందాల పోటీల పేరుతో వెకిలి చేష్టలకు ప్రభుత్వ ప్రోత్సాహం!
 
* మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ఇద్దరు యువ కాంగ్రెస్ నేతలు!
 
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు శనివారం  గ్రాండ్ ఫైనల్ కు రాగా, మరోవంక నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్ధాంతరంగా పోటీల నుండి మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ వైదొలగడం తెలంగాణ ప్రతిష్టను మంటగరిపే విధంగా ఉంది. గతంలో ఎక్కడా ఇటువంటి దారుణమైన ఆరోపణలు రాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తున్నది. 
 
చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన ప్రభుత్వ విందులో కొందరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం, నిర్వాహకులు దీనిని పట్టించుకోకపోవడం ఆమెను తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్టు సమాచారం. అయితే మ్యాగీ ఒక్కరే కాకుండా పోటీదారులందరూ బాధితులేనని తాజాగా వెల్లడైంది. విందుకొచ్చిన అతిథుల్లో కొందరు పోటీదారులనుద్దేశించి ‘మీరు బోరింగ్‌గా ఉన్నారు.. మమ్మల్ని ఖుషీ చేయడం లేదు’ అని వాపోయినట్లు తెలిసింది. 
 
తనకు జరిగిన అవమానాన్ని మిల్లా మ్యాగీ తన సహచర పోటీదారులతో చెప్పుకోగా వారు కూడా తాము అదే పరిస్థితిని ఎదుర్కొన్నామని గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన మ్యాగీ ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లిందని, ఆ మేరకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిసింది.  అయితే ఇలాంటి ఈవెంట్‌లో ఇవన్నీ సహజమేనని, నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా ఆమె ఆరోపణలను కొట్టిపారేసినట్టు సమాచారం. 
ఇక చేసేదిలేక నిస్సహాయస్థితిలో ఆమె పోటీనుంచి తప్పుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఆయా దేశాల కంటెస్టెంట్లు తమకు జరిగిన అవమానాలతో తప్పుకోవడం ఇష్టంలేక బలవంతంగా కొనసాగినట్టు తెలుస్తున్నది.  చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందే మిల్లా మ్యాగీ పోటీ నుంచి తప్పుకొనేలా చేసింది. ఈ విషయమై ప్రభుత్వ అధికారులు సహితం అనుచితంగా ప్రవర్తించే వారిని కాపాడే ప్రయత్నంతో పాటు ఆమెనే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది.

సుమారు 300 మంది పాల్గొన్న ఆ విందులో అతిథులను అలరించడానికి వారితో ఫొటోలు దిగాలని, డ్యాన్స్‌లు చేయాలని, క్యాట్‌వాక్‌ చేయాలని నిర్వాహకులు పోటీదారులకు సూచించినట్టు తెలిసింది. ఇదే ఆమెను అసౌకర్యానికి గురిచేసింది. ఆమెకు ఇష్టం లేకపోయినా అతిథుల్లోని కొందరు బడాబాబులు బలవంతంగా స్టెప్పులు వేయించే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మిస్‌ ఇంగ్లండ్‌ ఆరోపణలపై ప్రభుత్వం వేసిన కమిటీ 109 మంది కంటెస్టెంట్లను, నిర్వాహకులను ప్రశ్నించినట్టు చెప్తున్నారు.  మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించింది ఇద్దరు కాంగ్రెస్ యువనేతలని ఆ కమిటీ గుట్టు రట్టు చేసిన్నప్పటికీ ఆ నివేదికను బయటపెట్టకుండా ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది.  విందుకు అతిథులుగా వచ్చిన ఆ ఇద్దరు నేతలు మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయినట్టు తెలిసింది. 

మిస్‌ ఇంగ్లండ్‌ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా ఐపీఎస్‌ అధికారులతో అంతర్గత విచారణకు ఆదేశించింది. మిస్‌ ఇంగ్లండ్‌ కూర్చున్న టేబుల్‌ వద్ద ఏం జరిగిందనే అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించి మూడు రోజుల పాటు విచారించిన అధికారుల బృందం ఇద్దరు వ్యక్తులను అనుమానించినట్టు సమాచారం. 

సీసీ పుటేజ్‌లలో వారి వెకిలి చేష్టలను స్పష్టంగా గుర్తించినట్టు, అదే అంశాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపరచి ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు కూడా 40 ఏండ్లలోపు వారేనని, వారిలో ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేత కాగా, మరొకరు ముఖ్యనేత నిత్యం పేరుపెట్టి పిలిచేటంత సాన్నిహిత్యం ఉన్న కార్పొరేషన్‌ నేతగా విచారణ కమిటీ గుర్తించినట్టు ప్రచారం జరుగుతున్నది. 

చౌమహల్లా విందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు మొత్తం బయటపెడితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని, కాబట్టి దానిని బయటపెట్టాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. చౌమహల్లా ప్యాలెస్‌, ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగిన కొన్ని ప్రైవేట్‌ కార్యక్రమాల సీసీటీజీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి.  అయితే, అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణ పూర్తైందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. మిల్లా మ్యాగీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, మిస్ వరల్డ్ నిర్వహకులు ఆమెపై లండన్‌లో కేసు వేశారని, అక్కడ ప్రభుత్వమే చట్టరీత్య చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

మరోవంక, తమను కాపాడుకొనేందుకు మిస్‌వరల్డ్‌ పోటీల తీరును బట్టబయలు చేసిన మిల్లా మ్యాగీపై నిర్వాహకులు ఎదురు దాడికి దిగారు. ఆమె కావాలనే పోటీ నుంచి తప్పుకుని ఆరోపణలు చేస్తున్నదని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమె సామాజిక వ్యవహారాలను పరిశీలించిన కొందరు మ్యాగీ ఎంతో నిబద్ధతగల వ్యక్తి అని కొనియాడుతున్నారు. 

సాధారణంగా అందాల పోటీలు అంటే సన్నగా, నాజుగ్గా ఉండాలి. కానీ కొలతలతో పనేంటి అంటూ ప్లస్‌ సైజ్‌తో ఉన్న ఆమె ధైర్యంగా ముందుకొచ్చి మిస్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. ప్లస్‌సైజ్‌తో మిస్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలుచుకున్న మొదటి యువతి కూడా ఆమెనే. పైగా, మిల్లా మ్యాగీ సామాజిక దృక్పథం ఉన్న యువతి. 

గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆ మరణాలను సీపీఆర్‌తో తగ్గించే అవకాశం ఉందని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తనకు లభించిన ప్రతి వేదికపై ఆమె సీపీఆర్‌ ప్రాధాన్యత.. ఆస్కిల్‌తో ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడవచ్చో వివరిస్తున్నది. అందులో భాగంగా ఆమె ‘గో ఫార్‌ విత్‌ సీపీఆర్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల స్థాయి నుంచే సీపీఆర్‌పై సిలబస్‌ ఉండాలని ప్రచారం చేస్తున్నది.