
బ్యాంకింగ్‌లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.36,014 కోట్ల విలువైన మోసాలు జరిగాయని తెలిపింది. అంతక్రితం ఏడాది రూ.12,230 కోట్ల మోసాలు జరిగాయి. సంఖ్య పరంగా చూస్తే మాత్రం 2023-24లో 36,060 మోసాలు జరగగా, ఆ తర్వాతి ఏడాదికిగాను 23,953కి తగ్గాయి. ప్రధానంగా 122 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వర్గీకరించడం వల్లనే విలువ భారీగా పెరిగిందని తెలిపింది. బ్యాంకింగ్ మోసాల్లో డిజిటల్ పేమెంట్లు, కార్డు, ఇంటర్నెట్ ద్వారా జరిగే మోసాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది.
మొత్తం మోసాల్లో 60 శాతం మోసాలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే జరిగాయని తెలిపింది. మొత్తం విలువల్లో వీటి వాటా 71 శాతంగా ఉన్నది. కార్డు/ఇంటర్నెట్ ద్వారా జరిగే మోసాలు అధికంగా 13,516గా నమోదయ్యాయి. మొత్తం 23,956 మోసాల్లో వీటి వాటా 56.5 శాతంగా ఉన్నది. లక్ష రూపాయల కంటే అధికంగా నమోదైన మోసాల గురించి ఆర్బీఐ వివరించింది.
కాగా, కరెన్సీ ప్రింటింగ్ కోసం పెట్టే రిజర్వుబ్యాంక్ గరిష్ఠ స్థాయిలో ఖర్చు చేస్తున్నది. గతేడాదికిగాను కరెన్సీల ప్రింటింగ్ కోసం రూ.6,372.8 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అంతక్రితం ఏడాది ఖర్చు చేసిన రూ.5,101.4 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగినట్టు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. నోట్లు సంఖ్య ఆరు శాతం అధికం కాగా, విలువ పరంగా చూస్తే 5.6 శాతం పెరిగాయి.
కరెన్సీ ప్రింటింగ్‌లో రూ.500 నోట్ 86 శాతం వాటా కలిగివున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే రూ.10 డినామినేషన్ బ్యాంక్ నోట్ వాటా 16.4 శాతంగా ఉన్నది. మొత్తం బ్యాంక్ నోట్ల సర్క్యూలేషన్‌లో రూ.10, రూ.20, రూ.50 మొత్తంగా 31.7 శాతం వాటా కలిగివున్నది. రెండేండ్ల క్రితం రద్దు చేసిన రూ.2 వేల నోట్లలో ఇప్పటి వరకు 98.2 శాతం నోట్లు బ్యాంకుల వద్ద జమ అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500 నోట్లు చలామణిలో ఉన్నాయి.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు