కర్ణాటకలో కమల్ థగ్ లైఫ్‌ సినిమాపై నిషేధం

కర్ణాటకలో కమల్ థగ్ లైఫ్‌ సినిమాపై నిషేధం
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ చిత్రం థగ్ లైఫ్‌ విడుదలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో సినిమా విడుదలపై నిషేధం విధిస్తున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించింది. తమిళం నుంచి కన్నడం పుట్టిందంటూ గత వారం చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో కమల్ వ్యాఖ్యానించడంపై కన్నడ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
కమల్ క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, ఇందుకు కమల్ నిరాకరించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే క్షమాపణ చెప్పేవాడనంటూ ఆయన స్పందించడంతో కేఎఫ్‌సీసీ తాజా నిర్ణయం తీసుకుంది. దీనిపై కేఎఫ్‌సీసీ ప్రతినిధి సా.రా.గోవిందు మీడియాతో మాట్లాడుతూ కమల్ తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ సంస్థలు గట్టిపట్టుతో ఉన్నాయని స్పష్టం చేశారు.
 
దీంతో సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్ణయించామని చెప్పారు. కమల్ ఇంతవరకు తన మాటల్లో ఎక్కడా సారీ చెప్పలేదని, దీంతో కన్నడ రక్ష వేదక, ఇతర కన్నడ సంస్థలు చేస్తున్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. సినిమాపై నిషేధం విధించాలని పలు కన్నడ సంస్థలు డిమాండ్‌ చేయడంతో వారితో తాము చర్చించామని, కమల్ తప్పుగా మాట్లాడినట్టు ఏకీభవిస్తున్నామని చెప్పారు. ఆయనను కలిసి మాట్లాడేందుకూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు, కన్నడ భాషపై ఇటీవలి తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లను నటుడు కమల్ హాసన్ తోసిపుచ్చారు. తాను తప్పుచేసినట్లు రుజువైతేనే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. ప్రస్తుత వివాదంలో అది సాధ్యంకాదని కమల్ అభిప్రాయపడ్డారు. ఇదే తన జీవన విధానమని, అందులో జోక్యం చేసుకోవద్దని ప్రజలను కోరారు.