
ఏపిలోని పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల తెలంగాణలోని ఆరు వాగుల పరిధిలో ఎదురయ్యే సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర జలసంఘం (సిడబ్ల్యూసి) సానుకూలంగా స్పందించింది. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాల మేరకు క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టకు సంబంధించిన క్రాస్ సెక్షన్లు, ఇతర సాంకేతిక సమాచారాన్ని కూడా సేకరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సిడబ్ల్యూసి హైదరాబాద్ విభాగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం (సిడబ్లూసి) చీఫ్ ఇంజనీర్ (హైడ్రలాజికల్ స్టడీస్ ఆర్గనైజేషన్) విశాల్ గార్గ్ ఆదేశాలు జారీచేశారు. ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చును పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఏ) భరించనున్నది.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల బ్యాక్వాటర్ కారణంగా తెలంగాణలోని ఆరు ప్రధాన వాగుల్లో డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగడంతో పాటు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో ఈ ఆరు వాగులపై డ్రైనేజీ సమస్యల అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘాన్ని అధ్యయనం చేయాలని కోరింది. దీని ఆధారంగా కేంద్ర జల సంఘం ఈ నెల 23న పోలవరం ప్రాజెక్టు అథారిటీ మెంబర్ సెక్రటరీకి ఒక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఆరు వాగుల క్రాస్ సెక్షన్లపై సర్వే కొనసాగనున్నది.
అవి తురుబాక వాగు, ఏటపాక స్థానిక వాగు, గోదావరి కుడివైపున ఉన్న మరో స్థానిక వాగు, ఎదుళ్లవాగు,పెద్దవాగు, దొమ్మలవాగులపై ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేయనున్నారు. డ్రైనేజీ సమస్యల అధ్యయనం కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, నిర్దిష్ట వ్యవధుల్లో అంటే 200 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు సర్వే చేయనున్నారు.
సర్వేలో ప్రధానంగా వాగుల క్రాస్ సెక్షన్ల వివరాలు, ఆయా వాగులు ప్రధాన గోదావరితో అనుసంధానం, దోమలవాగు విషయంలో కిన్నెరసానితో కలిసే ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాల వివరాలను (తగ్గించిన లెవెల్, చైనేజీతో సహా ఎక్సెల్ ఫార్మాట్లో) క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
More Stories
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్