గాజాలో కాల్పుల విరమణకు హమాస్ తిరస్కరణ

గాజాలో కాల్పుల విరమణకు హమాస్ తిరస్కరణ
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా ప్రతిపాదనలను హమాస్‌ తిరస్కరించిందని ఆ సంస్థ నాయకుడు తెలిపారు. అంతకుముందు అమెరికా ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌తో జరిపిన చర్చల్లోని అంశాలకు ఈ ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌ ఇటీవల ఓ కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీని ప్రకారం హమాస్‌ సజీవంగా ఉన్న 10 మంది బందీలను అప్పగించడంతోపాటు18 మంది మృతదేహాలను కూడా ఇవ్వాలి.
రెండు దశల్లో ఇది జరగాలి. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్‌ 60 రోజులు కాల్పుల విరమణను పాటించడంతోపాటు, తమ బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను అప్పగించాల్సి ఉంటుంది. వాస్తవానికి హమాస్‌ వద్ద 58 మంది బందీలు ఉన్నారు. వారిలో కనీసం 20 మంది సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌ బలంగా నమ్ముతోంది. దీనిపై ఇజ్రాయిల్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ప్రధాని నెతన్యాహూ మాత్రం బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ తాను ఆ ఒప్పందానికి అంగీకరిస్తానని చెప్పారు. 

ప్రస్తుతం గాజాను పూర్తిగా మూసేసిన ఇజ్రాయిల్‌ మార్చి 18 నుంచి ఎదురుదాడులు కొనసాగిస్తోంది. దీంతో అప్పటివరకు అమెరికా, ఖతార్‌, ఈజిప్ట్‌ సంయుక్తంగా కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారిపోయింది. ఈ నెల 19 నుంచి మరింత విస్తృతంగా ఇజ్రాయిల్‌ దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. అవి గాజాను పూర్తిగా అధీనంలోకి తీసుకొంటాయని నాడు నెతన్యాహూ వెల్లడించారు.

గత 10 వారాల్లో దాదాపు 4,000 మంది ప్రజలు గాజాలో మరణించినట్టు హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా, గాజాకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకోవడంపై ఫ్రాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇక నుంచి మానవతా సాయాన్ని అడ్డుకుంటే ఇజ్రాయిల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ హెచ్చరించారు.

రెండు దేశాల సిద్ధాంతానికి ఫ్రాన్స్‌ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ‘మానవతా సాయానికి సృష్టిస్తున్న అడ్డంకులు భరించలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు స్పందించకపోతే పరిస్థితి గంటలు, రోజుల్లోనే దిగజారిపోతుంది. అందుకే మేం కఠిన వైఖరి అవలంభిస్తాం’ అని స్పష్టం చేశారు. “ఇజ్రాయిల్‌పై ఆంక్షల అంశాన్ని కూడా ఫ్రాన్స్‌ పరిశీలిస్తుంది. మేం మానవాతా సాయం అందించడానికి వీలుగా ఇజ్రాయిల్‌ తన వైఖరి మార్చుకొంటుందని ఆశిస్తున్నాను. పాలస్తీనా-ఇజ్రాయిల్‌ సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమని నమ్ముతున్నాం. పాలస్తీనా ఉండాల్సిన అవసరం చాలా ఉంది” అని మాక్రాన్‌  పేర్కొన్నారు.