2024-25 జీడీపీ వృద్ధి 6.5 శాతం, నాల్గో త్రైమాసికంలో 7.4 శాతం

2024-25 జీడీపీ వృద్ధి 6.5 శాతం, నాల్గో త్రైమాసికంలో 7.4 శాతం
త ఆర్థిక సంవత్సరం (2024-25) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో జీడీపీ వృద్ధి రేటు మార్కెట్‌ అంచనాలను మించి ఏడాది గరిష్ఠ స్థాయి 7.4 శాతానికి పెరిగింది. ప్రైవేట్‌ వినియోగం పుంజుకోవడంతో పాటు నిర్మాణం, తయారీ రంగాలు మంచి పనితీరును కనబర్చడం ఇందుకు దోహదపడింది. క్యూ4 వృద్ధి దన్నుతో 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదైంది. 
 
ఇది నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి, 2023-24 వృద్ధి రేటు 9.2 శాతంతో పోలిస్తే బాగా తగ్గినప్పటికీ, ఈ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలోనే ఉంది. అంతేకాదు, చైనాతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థితిలో ఉంది. ఈ జనవరి-మార్చిలో చైనా జీడీపీ వృద్ధి 5.4 శాతమే. వార్షిక, త్రైమాసిక వృద్ధిపరంగా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. వరుసగా నాలుగేళ్లుగా భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అధిక వృద్ధిని నమోదు చేస్తోంది

గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.330.68 లక్షల కోట్లకు (3.9 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. తద్వారా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6.3-6.8 శాతం వృద్ధి రేటుతో భారత్‌ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలున్నాయి. మరి కొన్నేళ్లలో భారత ఎకానమీ సైజు 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.

“ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలోకెల్లా భారత్‌ అధిక వృద్ధిని నమోదు చేయడం వరుసగా ఇది నాలుగో ఏడాది. తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల పనితీరు ఇందుకు తోడ్పడింది. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో తయారీ రంగం పనితీరు బాగుంది. దాంతో ఆ త్రైమాసిక జీడీపీ కూడా 7.4 శాతానికి ఎగబాకింది. ఈ సందర్భంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ధన్యవాదాలు తెలుపుతున్నా” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు. .

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్ఓ) డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ లేదా స్థిర (2011-12 నాటి) ధరల ఆధారిత జీడీపీ రూ.187.97 లక్షల కోట్లకు పెరిగిందని అంచనా. 2023-24 లో నమోదైన రూ.176.51 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 6.5 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, 2024-25లో నామినల్‌ జీడీపీ లేదా ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ రూ.330.68 లక్షల కోట్లకు ఎగబాకింది. 

2023-24లో నమోదైన రూ.301.23 లక్షల కోట్ల నామినల్‌ జీడీపీతో పోలిస్తే 9.8 శాతం వృద్ధి చెందింది. 2024-25 క్యూ4 విషయానికొస్తే, వాస్తవ జీడీపీ లేదా స్థిర ధరల ఆధారిత జీడీపీ వార్షిక ప్రాతిపదికన 7.4 శాతం వృద్ధితో రూ.51.35 లక్షల కోట్లకు చేరగా.. నామినల్‌ జీడీపీ లేదా ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ 10.8 శాతం వృద్ధితో రూ.88.18 లక్షల కోట్లకు పెరిగింది. 

2024-25 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీవీఏ (జోడించిన స్థూల విలువ)ను ఎన్‌ఎ్‌సఓ రూ.171.87 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 2023-24లో ఈ అంచనా రూ.161.51 లక్షల కోట్లుగా ఉంది. 2024-25 నామినల్‌ జీవీఏను రూ.300.22 లక్షల కోట్లుగా అంచనా వేసింది. 2023-24లో ఇది రూ.274.13 లక్షల కోట్లుగా ఉంది. 

కాగా, ఈ జూన్‌తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (క్యూ1) జీడీపీ వృద్ధి గణాంకాలను ఎన్‌ఎ్‌సఓ ఈ ఆగస్టు 29న విడుదల చేయనుంది. నికర జాతీయ ఆదాయం ప్రకారంగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజల తలసరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.4 శాతం పెరిగి రూ.1,14,710కి చేరింది. 2023-24లో ఇది రూ.1,08,786గా ఉంది. కాగా, 2024-25లో నికర జాతీయ ఆదాయం రూ.1,61,51,199 కోట్లుగా నమోదైంది.

కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) శుక్రవారం విడుద ల చేసిన డేటా ప్రకారం 2024-25 ద్రవ్య లోటు రూ.15,77,270 కోట్లుగా నమోదైంది. ఈ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనా వేసిన రూ.15,69,527 కోట్లకు దరిదాపుల్లోనే ఉంది. 

గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి రూ.30.36 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని, బడ్జెట్‌ అంచనాల్లో ఇది 98.3 శాతమని సీజీఏ తెలిపింది. వ్యయాలు రూ.46.55 లక్షల కోట్లకు పెరిగాయని, బడ్జెట్‌ అంచనాల్లో ఇది 98.7 శాతమని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆదాయం, వ్యయాల మధ్య అంతరాన్ని ద్రవ్య లోటు అంటారు. మార్కెట్‌ నుంచి రుణాల సమీకరణ ద్వారా ప్రభుత్వం ఈ లోటును భర్తీ చేస్తుంది.