తెలంగాణాలో గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ

తెలంగాణాలో గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ
గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి శ‌నివారం స‌మీక్షించారు.  గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాల‌ని సూచించారు.
మొదటి దశలో వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని చెప్పారు.  కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోశాల నిర్వహణ, ప‌శువుల‌ సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి ప‌రిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లో తుది మోడల్ ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఈ సమీక్ష సమావేశంలో సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజ్, అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎం ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.