ఆపరేషన్ సిందూర్ పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న కొలంబియా

ఆపరేషన్ సిందూర్ పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న కొలంబియా
 
కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం సైనిక దాడుల తర్వాత పాకిస్తాన్‌కు సంతాపం తెలుపుతూ కొలంబియా గతంలో జారీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకుందని కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ శనివారం తెలిపారు. ప్రస్తుతం బొగోటాలో భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న థరూర్, కొలంబియా నుండి వచ్చిన సందేశం సంఘర్షణ స్వభావాన్ని ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత, ఈ తిరోగమనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
“ఒకవైపు ఉగ్రవాదులకు, మరోవైపు అమాయక పౌరులకు మధ్య సమానత్వం సాధ్యం కాదు” అని థరూర్ స్పష్టం చేశారు. “మన దేశంపై దాడి చేసేవారికి, తమ స్వంత దేశాన్ని రక్షించుకునేవారికి మధ్య సమానత్వం లేదు. కొలంబియా ఇంతకు ముందు జారీచేసిన ప్రకటనతో మాకు నిరాశ కలిగించిన ఏకైక విషయం ఏమిటంటే అది ఈ వ్యత్యాసాన్ని విస్మరించినట్లు అనిపించింది. ఆ ప్రకటన ఉపసంహరించుకున్న ట్లు తెలుసుకుని మేము చాలా సంతోషిస్తున్నాము” అని చెప్పారు.
 
శుక్రవారం థరూర్ కొలంబియా ప్రభుత్వం ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి తెలియచేయడం పోయి “పాకిస్తాన్‌లో జరిగిన ప్రాణనష్టంపై హృదయపూర్వక సంతాపం” వ్యక్తం చేయడంపై నిరాశ వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఈ నెల ప్రారంభంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.
 
ఈ దాడులు చాలా రోజులు కొనసాగాయి. మే 10న భారత, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిశాయి. కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా యోలాండా విల్లావిసెన్సియో, భారత ప్రతినిధి బృందంతో చర్చల సందర్భంగా గతంలో జారీచేసిన సంతాప ప్రకటను వెనక్కి తీసుకున్నట్లు కనిపించింది.
 
“ఈ రోజు మాకు అందిన వివరణ, వాస్తవ పరిస్థితి, సంఘర్షణ, కాశ్మీర్‌లో ఏమి జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారంతో, మేము సంభాషణను కూడా కొనసాగించగలమని  చాలా నమ్మకంగా ఉన్నాము” అని ఆమె పేర్కొన్నారు. ప్రతినిధి బృందంలో భాగమైన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య, కొలంబియా వైఖరిలో మార్పును స్వాగతించారు.
 
“మా వాదనలలోని యోగ్యతను ఉప మంత్రి, అధికారులు గ్రహించి, వారు గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకునేంత దయతో ఉన్నారు. వారు భారతదేశం  వైఖరి పట్ల పూర్తి సానుభూతి, అవగాహనను కూడా వ్యక్తం చేశారు” అని చెప్పారు.  బొగోటాలో జరిగిన మీడియా సమావేశంలో, థరూర్ ఉగ్రవాదంపై భారతదేశపు వైఖరిని వివరిస్తూ ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను ప్రస్తావించారు.
 
భారత ప్రతినిధి బృందం కొలంబియా మాజీ అధ్యక్షుడు సీజర్ గవిరియాను కూడా కలిసింది. ఆయన ప్రస్తుతం లిబరల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు- ఆయన దేశంలోని జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద రాజకీయ సమూహం. “భారతదేశం ఉగ్రవాదంపై పోరాటానికి ఆయన గట్టిగా మద్దతు ఇచ్చారు. దానిని బహిరంగంగా కూడా చెప్పడానికి పూనుకున్నారు” అని థరూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులలో భువనేశ్వర్ కలిత (బిజెపి), మిలింద్ దేవరా (శివసేన), శాంభవి (ఎల్‌జెపి), జిఎం హరీష్ బాలయోగి (టిడిపి), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఉన్నారు.