ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్రకు యోగాంధ్ర

ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్రకు యోగాంధ్ర

ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్ర సాకారానికి ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా మే 21న ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్య‌క్ర‌మం ముందుకెళ్తోంద‌ని, ఇదే స్ఫూర్తితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు స‌మ‌ష్టిగా అడుగులేద్దామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ పిలుపునిచ్చారు.  ఆయుష్‌శాఖ‌, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ క‌మిష‌న‌రేట్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో గురువారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో నిర్వ‌హించిన పోలీసు థీమ్ యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొని సీనియ‌ర్ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో క‌లిసి యోగాస‌నాలు అభ్య‌సించారు.

అనంత‌రం సీఎస్ మాట్లాడుతూ ఆరోగ్య‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం జూన్ 21 వ‌ర‌కు రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని, అప్ప‌టికి క‌నీసం రెండుకోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్ర‌ణాళిక ప్ర‌కారం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైన‌ర్లు న‌మోదు చేసుకున్నార‌ని, వీరి స‌హాయంతో ప్ర‌జ‌ల‌కు యోగాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు యోగాస‌నాలు నేర్చుకునేలా ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు.

26 జిల్లాల్లో 26 థీమ్‌ల‌తో యోగాంధ్ర ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, విభిన్న ప్ర‌తిభావంతులు- ఇలా స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి యోగాను చేరువ‌చేసేందుకే ఈ థీమ్ యోగాను నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ యోగా విశిష్ట‌త‌ను వివ‌రించి, అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకు ప్ర‌తిజిల్లాలో నాలుగైదు చొప్పున ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు.