అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది

జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు జరుగనున్న అమ‌ర్‌నాథ్ యాత్ర‌ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు (సిఎపీఎఫ్‌) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. అంటే సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది అమ‌ర్‌నాథ్ రూట్లో విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు.

ఇప్ప‌టికే 424 కంపెనీల బ‌ల‌గాల‌ను కేంద్ర పాలిత ప్రాంతానికి పంపించారు. ఇక మిగితా 80 కంపెనీల ద‌ళాలు ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో అక్క‌డ‌కు పంపారు. వాళ్ల‌ను కూడా వివిధ లొకేష‌న్ల‌కు మార్చుతున్న‌ట్లు చెప్పారు. అమ‌ర్‌నాథ్‌ యాత్రికుల‌కు పూర్తి స్థాయి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర బ‌ల‌గాలు పేర్కొన్నాయి. 

త‌క్ష‌ణ‌మే కేంద్ర బ‌ల‌గాలు జ‌మ్మూక‌శ్మీర్‌లో పొజిష‌న్ తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22న జ‌రిగిన పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేస్తున్నారు. సీఏపీఎఫ్‌కు చెందిన అయిదు కంపెనీల్లో సీఆర్పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్బీ ఉన్నాయి. గురువారం జ‌మ్మూ పర్యటన స‌మ‌యంలో భ‌ద్ర‌తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌మీక్షింఛారు. 

సీఆర్పీఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ జ్ఞానేంద్ర ప్ర‌తాప్ ఇప్ప‌టికే అమ‌ర్‌నాథ్ యాత్ర‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. బీఎస్ఎఫ్ డీజీ ద‌ల్జిత్ సింగ్ చౌద‌రీ కూడా త్వ‌ర‌లో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు రెండు మార్గాల్లో వెళ్తారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పెహల్గామ్ దారి 48 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇక గందేర్‌బ‌ల్ జిల్లాలోని బ‌ల్తాల్ రూట్‌లో 14 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.