న్యూఢిల్లీ- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ స్లీపర్‌

న్యూఢిల్లీ- సికింద్రాబాద్‌ మధ్య వందే భారత్‌ స్లీపర్‌
అత్యాధునిక ప్రపంచస్థాయి సౌకర్యాలతో రైల్వేలు ప్రవేశపెడుతున్న వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను న్యూఢిల్లీ- సికింద్రాబాద్‌ మధ్య ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. రైలు కేవలం 20 గంటల్లోనే 1,667 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాంతో జాతీయ రాజధానిని దక్షిణ భారతదేశంతో అనుసంధానిస్తుందని, కనెక్టివిటీని పెంచుతుందని రైల్వేశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రైలులో 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఈ రైలులో మూడు కేటగిరిలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. ఏసీ త్రీటైర్‌-11, ఏసీ టూ టైర్‌-నాలుగు, ఫస్ట్‌ ఏసీ-ఒక కోచ్‌ ఉంటాయి. 

ప్రతి ఒక్కటి ఎర్గోనామిక్ బెర్త్‌లు, ఛార్జింగ్ పోర్ట్‌లు, క్యాటరింగ్, వెంటిలేషన్, అత్యాధునిక వాష్‌రూమ్‌లు ఈ రైళ్లలో ఉండనున్నాయి. ఈ రైలుకు ఆగ్రా కాంట్‌, గ్వాలియర్‌, ఝాన్సీ, భోపాల్‌, నాగ్‌పూర్‌, కాజీపేట స్టాప్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

రైలులో థర్డ్‌ ఏసీ ప్రయాణానికి రూ.3600, సెకండ్‌ ఏసీకి రూ.4800, ఫస్ట్‌ ఏసీకి రూ.6వేల వరకు టికెట్ల ధరలు ఉండే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపాయి. రైల్వేశాఖ వందే భారత్‌ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నది. సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రైల్వేశాఖ వందే భారత్‌ రైళ్లను తీసుకురాబోతున్నది. 

ఇటీవల రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్డీఎస్ఓ) తొలి వందే భారత్‌ స్లీపర్‌ ముంబయి – అహ్మదాబాద్‌ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ రైలు 16 కోచ్‌లతో రైలు పరుగులు తీసింది. ఈ ఏడాది జనవరి తొలివారం రైలును కోటాలో 30-40 కిలోమీటర్ల స్వల్ప దూరంలో సైతం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 

ఈ సమయంలో రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు రాబోయే కాలంలో రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రోటోటైప్‌ విజయవంతమైన ట్రయల్‌ రన్‌ పూర్తి చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైలులో దాదాపు 1,128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్‌ స్లీపర్‌ రైలు 50 రేకుల కోసం ఆర్డర్‌ వచ్చింది. రాబోయే రెండేళ్లలో సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. 2026-27 సంవత్సరంలో 24 సెట్స్‌ ఉత్పత్తి కానున్నాయి.