పాక్‌ నేతలతో కలిసి ర్యాలీలో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌

పాక్‌ నేతలతో కలిసి ర్యాలీలో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌
ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, పాకిస్థాన్‌ను కాళ్లబేరానికి వచ్చేలా చేశామని మనం భావిస్తున్నా పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు మాత్రం పాకిస్థాన్‌లో రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను వెంటపెట్టుకుని మరీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా కమాండర్‌ సైఫుల్లా కసూరీ దర్జాగా బహిరంగంగా తిరుగుతూ రాజకీయ వేదికలపై భారత వ్యతిరేక ఉపన్యాసాలు చేస్తున్నాడు.  
బుధవారం పంజాబ్‌ ప్రావిన్సులోని కసూర్‌ వద్ద పాకిస్థాన్‌ అణ్వస్త్ర పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూమ్‌ ఇ తక్బీర్‌ పేరిట పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌(పీఎంఎంఎల్‌) నిర్వహించిన ఓ బహిరంగ సభలో కసూరీ పాల్గొని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ర్యాలీలో సైఫుల్లా కసూర్‌ మాట్లాడుతూ “పహల్గాం ఉగ్రదాడిలో నన్ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది” అంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని నిమిషాల పాటు ప్రసంగించిన సైఫుల్లా భారత వ్యతిరేక నినాదాలు చేశాడు.

లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, హఫీజ్‌ సయీద్‌ కుమారుడు, ఉగ్రవాదిగా భారత్‌ ప్రకటించిన తల్హా సయీద్‌ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. పహల్గాం ఉగ్రదాడికి తాను సూత్రధారినని తనను భారత్‌ నిందిస్తున్నదని, యావత్‌ ప్రపంచంలో తన పేరు ఇప్పుడు మార్మోగుతున్నదని ర్యాలీలో మాట్లాడుతూ కసూరీ చెప్పాడు. భారత్‌ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్‌ ఇదే ర్యాలీలో ప్రసంగిస్తూ జిహాదీ నినాదాలు చేశాడు.

2024 పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసి సయీద్‌ ఓటమిపాలయ్యాడు. నిషిద్ధ లష్కరే తాయిబాకు రాజకీయ వేదికగా పీఎంఎంఎల్‌ ఉపయోగపడుతున్నది. గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌  హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్‌ ఖలీదే అని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రదాడికి అతడే ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 

పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఖలీద్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్‌ఐఏ పేర్కొంటోంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. ఐఎస్‌ఐ, పాక్‌ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఖలీద్‌తోపాటు ఈ దాడికి ప్లాన్‌ చేసిన వారిలో పీవోకేకి చెందిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.