అమెరికాతో చర్చల్లో సుంకాల ప్రస్తావనే రాలేదు

అమెరికాతో చర్చల్లో సుంకాల ప్రస్తావనే రాలేదు
* సుంకాలపై కోర్టులో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే, ట్రంప్‌ టారిఫ్‌లు అమలుకు యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు బ్రేకులు వేసింది. టారిఫ్‌లు విధించే అధికారాలు ట్రంప్‌కు లేవని తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
విచారణ సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల’ అంశాన్ని ట్రంప్‌ సర్కారు ప్రస్తావించగా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్‌.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్నిట్రంప్‌ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు.

కాగా, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాతో జరిగిన చర్చల్లో వాణిజ్య సుంకాల అంశమేదీ ప్రస్తావనకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. అమెరికా సుంకాల హెచ్చరికల వల్లే కాల్పుల విరమణ జరిగిందని న్యూయార్క్‌లోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌‌కు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలపడాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది.

‘‘ఈ అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి మే 10న కాల్పుల విరమణపై ప్రకటన చేసే వరకు భారత్, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. భారత్-పాక్ సైనిక ఘర్షణ స్థితిగతుల గురించి ఇరుదేశాలు చర్చించుకున్నాయి. ఈ చర్చల్లో వాణిజ్య సుంకాల అంశం అస్సలు ప్రస్తావనకు రాలేదు’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు.

‘‘కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదు. భారత్, పాక్‌లు నేరుగా ఆ విషయంపై చర్చలు జరిపాయి. కాల్పుల విరమణపై ఒక అవగాహనకు వచ్చాయి’’ అని గతంలోనే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. 90 రోజుల పాటు (జులై 9వరకు) పరస్పరం వాణిజ్య సుంకాలను విధించుకోకూడదని భారత్, అమెరికాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి. అప్పటిలోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరుదేశాలు సన్నద్ధమవుతున్న తరుణంలో కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌‌ అంశం తెరపైకి రావడం గమనార్హం.

కాగా, తన మధ్యవర్తిత్వం వల్లే కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని అనేక సార్లు భారత్ ఖండించింది. ఈక్రమంలోనే అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘భారత్, పాక్‌‌లు కాల్పుల విరమణకు అంగీకరించకుంటే ఇరుదేశాలతో వాణిజ్య సంబంధాలను అమెరికా తెంచుకుంటుంది అని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాతే భారత్, పాక్‌లు దారికొచ్చాయి’’ అని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌‌కు హోవర్డ్ లుట్నిక్ గతవారం తెలిపారు.

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ వాణిజ్య సుంకాలకు చట్టపరమైన ఎదురుదెబ్బ తగలకుండా చూసేందుకు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌‌‌లో అమెరికా వాణిజ్య శాఖ వాదనలు వినిపిస్తోంది.

‘‘వాణిజ్యపరమైన అంశాలపై భారత్, పాక్‌లకు హెచ్చరిక చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను వాడుకున్నారు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపిఎ)కు లోబడి ఈ అధికారాన్ని ట్రంప్ ప్రయోగించారు. తద్వారా అమెరికా ఆర్థిక, భద్రతా అంశాలను పరిరక్షించారు’’ అని కోర్టుకు హోవర్డ్ లుట్నిక్ వివరించారు.

‘‘ఒకవేళ అమెరికా అధ్యక్షుడి అధికారాలను వ్యతిరేకించేలా కోర్టు తీర్పు వెలువడితే ట్రంప్ ఆఫర్‌ను భారత్, పాక్‌లు ప్రశ్నించే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ఆ ప్రాంతంలోని భద్రతకు విఘాతం కలుగుతుంది. ఎంతోమంది ప్రాణాలు ముప్పును ఎదుర్కొంటాయి. చైనా ఆధిపత్యానికి తలుపులు తెరుచుకుంటాయి’’ అని కోర్టుకు హోవర్డ్ లుట్నిక్ తెలిపారు.