
భారత ఆర్థిక వ్యవస్థ దాని స్థిరమైన స్థూల ఆర్థిక మూలాలు, బలమైన ఆర్థిక రంగం, స్థిరమైన వృద్ధిని సాధించడంతో 2025-26లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. ప్రపంచ మార్కెట్‌లో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యం విచ్ఛిన్నం, సరఫరా గొలుసులో అంతరాయాలు మరియు వాతావరణ అనిశ్చితులు ద్రవ్యోల్బణం, వృద్ధిరేటుకు ప్రతికూలతను కలిగించే కారకాలుగా ఆర్‌బిఐ గుర్తించింది.
అయితే సరఫరా గొలుసుపై ఒత్తిళ్లను తగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు తగ్గించడం మరియు ముందస్తు నైరుతి రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగేందుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. భారత్ సంతకాలు చేసి చర్చలు జరుపుతున్న వాణిజ్య ఒప్పందాల ప్రభావం పరిమితంగా ఉండేలా చూసుకోవడానికి తోడ్పడతాయని, సేవల ఎగుమతులు, అంతర్గత చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతాల లోటును భర్తీ చేయవచ్చని సూచించింది.
వరుసగా రెండు సమీక్షలలో కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్‌బిఐ 12నెలల కాలంలో ద్రవ్యోల్బణం 4శాతం లక్ష్యానికి చేరుకునేందుకు అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లలో నియంత్రణ దృష్ట్యా బ్యాంకులు ట్రేడింగ్, బ్యాంకింగ్ బుక్ రిస్క్‌లను పరిష్కరించుకోవాలని ఆర్‌బిఐ సిఫారసు చేసింది.
ఇలా ఉండగా, ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాలెన్స్ షీట్ (ఆస్తి-అప్పుల పట్టిక) వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వృద్ధితో రూ.76.25 లక్షల కోట్లకు పెరిగింది. విదేశీ మారక (ఫారెక్స్) లావాదేవీల ద్వారా లాభాలు 33 శాతం పెరగడం ఇందుకు దోహదపడిందని, దీంతో కేంద్రా నికి ఈసారి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ అందించగలిగినట్లు గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.70,47,703.21 కోట్లుగా ఉన్న బ్యాలెన్స్ షీట్.. 2024-25 చివరినాటికి రూ.5,77,718.72 కోట్ల (8.20 శాతం) పెరుగుదలతో రూ.76.25,421.93 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఆదాయం 22.77 శాతం వృద్ధి చెందగా.. వ్యయాలు 7.76 శాతం పెరిగాయి. మిగులు నిధులు వార్షిక ప్రాతిపదికన 27.37 శాతం పెరిగి రూ.2,68,590.07 కోట్లుగా నమోదయ్యాయి. ఈ మిగులు నిధులనే ఆర్‌బీఐ డివిడెండ్ రూపంలో కేంద్రానికి బదిలీ చేస్తుంది.
గోల్డ్ (52.09 శాతం), దేశీయ పెట్టుబడులు (14.32 శాతం), విదేశీ పెట్టుబడుల (1.70 శాతం) పెరుగుదల ఆర్‌బీఐ బ్యాలెన్స్‌షీట్‌లో ఆస్తుల వృద్ధికి తోడ్పడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫారెక్స్ లావాదేవీల ద్వారా లాభాలు వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు