
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్టుగా సమాచారం. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం జస్టిస్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నదని తెలుస్తున్నది.
సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే ఆయనపై ఈ చర్యకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 14న రాత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కాలిన స్థితిలో కనిపించటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్చి 22న ఈ ఘటనపై ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.
ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన కమిటీ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని తెలపటంలో జస్టిస్ వర్మ విఫలమయ్యారని తేల్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ నివేదికను సమర్పించింది. ఆయనను అభిశంసించవచ్చని పేర్కొన్నది. ఆ నివేదిక ప్రకారమే ఈనెల 9న సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్వర్మను అభిశంసించి, పదవి నుంచి తొలగించాలని భారత రాష్ట్రపతి, ప్రధానులకు సిఫారసు చేశారు.
ఒకవేళ పార్లమెంటులో ఈ అభిశంసన తీర్మానం ఆమోదం పొందితే జస్టిస్ వర్మ తన పదవికి దూరమవుతారు. అదే జరిగితే ఇలా అభిశంసన ద్వారా వేటుకు గురయిన మొదటి న్యాయమూర్తి ఆయనే కావచ్చని తెలుస్తున్నది. కాలిన నోట్ల కట్టలు వెలుగు చూసిన తరువాత అలహాబాద్ హైకోర్టుకు ఆయనను బదిలీ చేయాన్ని అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే వర్మకు ఎలాంటి జ్యుడిషియల్ డ్యూటీలూ కేటాయించలేదు.
జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సమర్థించింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ తివారీ మాట్లాడుతూ ”ఈ చర్య (అభిశంసన) అనేది న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెరిగేలా చేస్తుంది. న్యాయమూర్తులే అవినీతిపరులైతే, కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది. అవినీతిపరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం తప్పనిసరి” అని చెప్పారు.
ఇది జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించింది మాత్రమే కాదని, కోర్టు ఉనికి, ప్రజల నమ్మకం, ప్రజాస్వామ్యానికి సంబంధించిందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే, ప్రజాస్వామ్యం ముగుస్తుందని ఆయన హెచ్చరించారు. అభిశంసనకు మద్దతుగా ఓటు వేయాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!