పాక్ లో ఉగ్రవాదుల మృతికి సంతాపమా? 

పాక్ లో ఉగ్రవాదుల మృతికి సంతాపమా? 
 
* కొలంబియా ప్రభుత్వ వైఖరి పట్ల శశిథరూర్ అసహనం
 
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ పాకిస్తాన్, పీవోకే లలోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన కచ్చితమైన క్షిపణి దాడులలో మృతి చెందిన ఉగ్రవాదులకు కొలంబియా ప్రభుత్వం సంతాపం ప్రకటించడం పట్ల కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడానికి బదులుగా కొలంబియా ప్రభుత్వం ఉగ్రమూకల మృతికి సంతాపం, సానుభూతి తెలపడం వింతగా ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్‌ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా థరూర్‌ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కొలంబియా ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ  ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుల పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేయకపోగా భారత్ దాడుల తర్వాత పాక్‌లో చనిపోయినవారికి మాత్రమే సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వ వైఖరి తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులు, భారత్‌ తీసుకున్న చర్యలను కొలంబియా అధికారులకు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శశిథరూర్ స్పష్టం చేశారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్‌ అనేక దాడులను భరించిందని ఈ సందర్భంగా శశిథరూర్‌ గుర్తు చేశారు. పాక్‌ తన సైనిక పరికరాలను రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి చేసేందుకు వినియోగిస్తోందని మండిపడ్డారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే భారత్‌ విధానాలు ఉంటాయని ఈ సందర్భంగా శశిథరూర్‌ స్పష్టం చేశారు. పహల్గాం దాడి వెనక పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్‌ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని వెల్లడించారు. 

పాక్‌లో వినియోగంలో ఉన్న రక్షణ పరికరాల్లో దాదాపు 81శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవేనని తెలిపారు. ఇదే విషయాన్ని తాము అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావించనున్నట్లు థరూర్‌ వెల్లడించారు.  ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్లకి, వాటిని ప్రతిఘటించే వాళ్లకి ఎప్పుడూ సమానత్వం ఉండదని, ఉండకూడదని శశిథరూర్ అన్నారు. కొలంబియా మాదిరే భారత్ కూడా అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు.