ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్, ప్రోగ్రసివ్ పాలిటిక్స్‌కు నాంది పలుకుదామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కడపలో టీడీపీ మహానాడు ముగింపురోజు జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు సమాజానికి అంతకంటే ప్రమాదకరమని హెచ్చరించారు. అటువంటి వారిని వారిని రాష్ట్రం నుంచి తరమికొడదామని చెప్పారు.
పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుందని; పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు టీడీపీ కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన మొదటి మహానాడుకు దేవుని గడపలో అదిరిపోయే స్పందన లభియించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గత ఏడాది మే 2వ తేదీన ప్రజాగళం ఎన్నికల సభ కోసం కడపకు వచ్చానని, ఆ రోజు సభలో కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పానని, అది ఇవాళ అక్షరాలా నిజమైందని పేర్కొన్నారు. అభివృద్ది-సంక్షేమం-సంపద సృష్టి నిరంతరం చేస్తూ, మెరుగైన జీవన ప్రమాణాలు అందించే విధానంతో అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పా రు.
గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు, భూ మాఫియాలకు ప్రజలు అల్లాడిపోయారని, తన రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. పేదలను దోచుకునేందుకు 22ఏను అస్త్రంగా చేసుకున్నారని, ఆస్తులను వివాదాల్లోకి నెట్టారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని, కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని తెలిపారు. రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఢిల్లీలో పరపతి పెరిగిందని, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టామని, 2027 డిసెంబర్ లోగా పోలవరం పూర్తిచేసే బాధ్యత తనదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కాపాడామని, రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశామని, అమరావతికి రూ. 15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం సహకరించిందని వివరించారు.
యువశక్తికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని తాను బలంగా నమ్ముతానని చెబుతూ అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే రూ. 7.50 లక్షలతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మీ రాష్ట్రంలో భూతం ఉంది. రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారని పేర్కొంటూ ఆ భూతాన్ని భూ స్థాపితం చేస్తున్నామని భరోసా ఇచ్చానని చెప్పారు. నూతనంగా తీసుకువచ్చిన 20కు పైగా విధానాలతో ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ