ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం

ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం

* రూ.కోటి డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు

ఇరాన్‌ లో ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి జాడ కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. భారతీయ రాయబార కార్యాలయం వెంటనే తెహరాన్ లోని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తెలిపింది.  వారిని గుర్తించి వారి భద్రతకు హామీ ఇవ్వాలని కోరినట్లు భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తప్పిపోయిన వారిని పంజాబ్‌ లోని సంగ్రూర్‌కు చెందిన హుషన్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌బీఎస్‌ నగర్‌కు చెందిన జస్పాల్‌ సింగ్‌, హోషియాపూర్‌కు చెందిన అమృత్‌పాల్‌ సింగ్‌గా గుర్తించారు. 
 
మే 1న టెహ్రాన్‌ లో ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే వీరు అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు పంజాబ్‌లోని ఓ ఏజెంట్‌ ముగ్గురు యువకులను దుబాయ్‌- ఇరాన్‌ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఇరాన్‌లో బస కల్పిస్తామని హామీ ఇచ్చి, అక్కడ దిగగానే కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపించారు. కిడ్నాపర్లు రూ.కోటి డిమాండ్‌ చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు,  ఆ ముగ్గురిని బంధించిన ఓ వీడియాను కిడ్నాపర్లు పంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ వీడియోలో వారు ముగ్గురిని పసుపు రంగు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. చేతులనుంచి రక్తం కారుతున్నట్లు ఉంది. 
 
కోటి రూపాయలు చెల్లించకపోతే వారిని చంపివేస్తామని కూడా కిడ్నాపర్లు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు కిడ్నాపర్ల ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడే వారు. మే 11 నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫోన్లు రాలేదు. మరోవైపు ఆ ముగ్గురిని విదేశాలకు పంపిన ఏజెంట్‌ హోషియాపూర్‌లో కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఏజెంట్ పై మే 16న ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.