స్పేస్ఎక్స్‌ ప్ర‌యోగం మరోసారి విఫ‌లం

స్పేస్ఎక్స్‌ ప్ర‌యోగం మరోసారి విఫ‌లం

అమెరికన్‌ టెక్‌ సంస్థ స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన స్టార్‌ షిప్‌ రాకెట్‌ మూడోసారి గాల్లో పేలిపోవడంతో అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం గత మంగళవారం రాత్రి 7 గంటల 36 నిముషాలకు టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్‌ తీరంలోని వేదిక నుంచి స్పేస్‌ఎక్స్‌ దీన్ని ప్రయోగించింది. 

టెక్సాస్‌లోని బోకా చికా స్టేషన్‌ నుంచి నింగిలోకి ప్రయోగించారు. తొలుత ప్రయోగం విజయవంతంగా సాగినట్లు కనిపించింది. అయితే, ప్రయోగం ప్రారంభమైన సుమారు 50 నిమిషాల తర్వాత రాకెట్‌ గాల్లోనే విఫలమైంది. స్పేస్‌ఎక్స్‌ అందించిన సమాచారం ప్రకారం  స్టేజ్‌ – సెపరేషన్‌ పూర్తయిన తర్వాత రాకెట్‌ రీ ఎంట్రీ దశలో సాంకేతిక లోపం తలెత్తింది.  దాంతో అది గాల్లోనే ధ్వంసమైపోయింది.

దీనిపై స్పేస్‌ఎక్స్‌ స్పందిస్తూ దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. సుదూర గ్రహాల మీదికి మానవులను పంపడానికి స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన స్టార్‌ షిప్‌ ఈ మూడో ప్రయోగంలోనూ విఫలమయ్యింది. ఇదివరకటి రెండు ప్రయోగాల్లోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. మార్చి నెల‌లో జ‌రిగిన 8వ స్టార్‌షిప్ ప్ర‌యోగం కూడా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. టెక్సాస్ నుంచి గాలిలోకి ఎగిరిన త‌ర్వాత కాసేప‌టికే అది పేలింది. దాంతో అప్పుడు అనేక అమెరికా విమానాల‌ను గ్రౌండ్ చేయాల్సి వ‌చ్చింది.

అంత‌రిక్ష వ్య‌ర్థాల ప‌ట్ల వార్నింగ్ కూడా ఇచ్చారు. గ‌త ప్ర‌యోగంతో పోలిస్తే ఈ సారి రెండు ద‌శ‌లు అధికంగానే రాకెట్ దూసుకెళ్లింది. మూడుసార్లు విఫలమైనప్పటికీ స్పేస్‌ఎక్స్‌ తగ్గేదేలేదు అని, ప్రయత్నాలు కొనసాగిస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాకెట్‌ పూర్తి స్థాయిలో పనిచేస్తే, భవిష్యత్‌లో చంద్రుడు, మంగళ గ్రహం వంటి దూర ప్రదేశాలకు మానవులను తీసుకెళ్లే గేట్వేగా పనిచేస్తుంది.

అయితే, వరుస వైఫల్యాలతో స్పేస్‌ఎక్స్‌ ముందున్న సవాళ్లు మరింత పెరిగినట్టయింది. రాకెట్‌ నిర్మాణం, పరిణామ దశలు, ప్రయోగాలపై కంపెనీ మరోసారి సమీక్ష చేపట్టి తదుపరి ప్రయత్నానికి సిద్ధమవుతోంది.