బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలి

బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవాలి
కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని, పని సంస్కృతి మెరుగుపరచాలని ఆయన సూచించారు. 

రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్త పరిచేందుకు కోలిండియా సహా సింగరేణిపై జరిగిన వీడియో సమీక్ష సమావేశంకు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇందులో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై కీలక దిశానిర్దేశం చేశారు.

ఉత్పత్తి ఖర్చు తగ్గింపునకు సింగరేణి అధికారుల, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, కమిటీ చేసే ఆచరణాత్మక సూచనలను వెంటనే అమలు జరిపి ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని సూచించారు. వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై కూడా గట్టి దృష్టి పెట్టాలని చెప్పారు. 

బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ బొగ్గు సంస్థల మనుగడకు కొత్త గనులను పెంచుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు బొగ్గు ధర అందుబాటులోకి తీసుకురావొచ్చని, దీంతో అంతిమంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కోల్ ఇండియా గనులతో పాటు సింగరేణి గనుల పనితీరును, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. సింగరేణి తరఫున సంస్థ సిఎండి ఎన్.బలరామ్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి ఈ సమీక్షలో పాల్గొన్నారు.