
రాజ్యసభ సభ్యునిగా ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పాకా సత్యనారాయణతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఖాళీ ఏర్పడిన ఒక రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.
దీంతో రాజ్యసభలో పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి పాక సత్యనారాయణ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా పాక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2028 వరకు సత్యనారాయణ పదవిలో కొనసాగనున్నారు.
వెనుకబడిన వర్గాలకు చెందిన పాకా వెంకటసత్యనారాయణ స్వస్థలం భీమవరం. న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగారు. 1976 లో ఆర్‌ఎస్‌ఎస్లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. 1978లో భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల ఏబీవీపీ కాంపస్ ఇన్ఛార్జ్గా సేవలందించి 1980లో బీజేపీలో చేరారు. 1980లో బీజేపీలో చేరిన తరవాత భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
1996 లోక్‌సభ ఎన్నికల్లో నరసాపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2006 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2006 నుంచి 2010 వరకు భీమవరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 2012 నుంచి 2018 వరకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2014లో ఉమ్మడి ఏపీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018 నుంచి 2021 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా పాక సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
More Stories
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు