
భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తికి సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొంటూ హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమని తెలిపారు.
ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. “గత నెలలో పహల్గాం దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసేవారికి తగిన సమాధానం. పహల్గాంలో ఉగ్రవాదులు చేసింది మానవత్వంపై దాడి. ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైంది” అని చెప్పుకొచ్చారు.
“పర్యాటక రంగ ప్రభావం ఎంత గొప్పదో సిక్కిం ప్రజలకు తెలుసు. పర్యాటకం అంటే విభిన్నత్వానికి ప్రతీక. ఇక, పహల్గాం ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదు. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి. ఎన్నో భారతీయ కుటుంబాల సంతోషాన్నిఉగ్రవాదులు హరించారు. భారత్‌లో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, భారత ఐకమత్యం ఎంత గొప్పదో ప్రపంచం చూసింది” అని తెలిపారు.
“ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశమంతా ఒక్కటై ఉగ్రవాదులకు దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమవడంతో పాక్ ఆక్రోశంతో మన సైన్యం, పౌరులపై దాడులకు తెగబడింది. దీంతో పాక్ బండారం బయటపడింది. పాక్ వైమానిక స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా భారత స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్లకు చూపించాము” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని.. రాష్ట్రంలో పలు అభివృద్ధికారక ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నమ్చీ జిల్లాలో రూ.750 కోట్లతో నిర్మించనున్న 500 పడకల జిల్లా ఆసుపత్రి, సాంగాచోలింగ్‌లోని ప్యాసెంజర్ రోప్‌వే, గాంగ్‌టాక్ జిల్లాలోని అటల్ అమృత్ ఉద్యానవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
వాస్తవానికి ప్రధాని మోదీ నేడు సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా ఈ పర్యటన రద్దైంది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాహస క్రీడలకు హబ్‌గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
“గ్యాంగ్‌టక్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను నేరుగా పాల్గొనాలనుకున్నాను. అందుకు వాతావరణం సహకరించలేదు. సిక్కిం సాహస క్రీడలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని తెలిపారు. సిక్కిం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం