
తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప నటుడి తీరుపై మండిపడ్డారు. మాతృభాషను గౌరవించడం కోసం మరో భాషను కించపరచాల్సిన అవసరం లేదని హితవు చెప్పారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కన్నడ భాష కొన్ని శతాబ్ధాలుగా మనుగడలో ఉందని తెలిపారు. దక్షిణాదిలో సోదరభావాన్ని పెంచాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి కొన్నేళ్లుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ ఇలాంటి మాటలు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొంటూ ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా విజయేంద్ర డిమాండ్ చేశారు. చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ సినిమా కార్యక్రమంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ని ఉద్దేశిస్తూ కమల్ మాట్లాడుతూ ‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. కన్నడ భాష కూడా తమిళం నుంచి పుట్టింది’ అంటూ వ్యాఖ్యానించారు.
కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ షెట్టి స్పందిస్తూ.. ‘మీ చిత్రాలకు కన్నడంలో వ్యాపారం కావాలి.. కానీ, మా భాషను తక్కువ చేసి మాట్లాడతారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన వ్యాఖ్యలపై వివాదం రేగడంపై కమల్ స్పందిస్తూ ప్రేమతో మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.
తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భాషల చరిత్ర గురించి తనకు చాలామంది చరిత్రకారులు చెప్పారని, తాను చెప్పిందంతా ప్రేమతోనే చెప్పానని తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని అంటూనే తనతో పాటు రాజకీయ నాయకులు ఎవరికీ భాషలపై మాట్లాడే నైపుణ్యం ఉండదని స్పష్టం చేశారు. భాషలపై లోతుగా చర్చించేందుకు ఆ విషయాన్ని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలివేద్దాం అని కమల్ పేర్కొన్నారు.
కాగా, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు డీఎంకేతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మిత్రపక్షం ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుంది. రాజ్యసభ సీట్లపై డీఎంకే బుధవారం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా, వాటిలో ఒక సీటును ఎంఎన్ఎంకు కేటాయించింది. ఈ సీటులో కమల్ హాసన్ పోటీ చేయనున్నారు. కాగా మూడు సీట్లకు అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం