
దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయరాదనే నిబంధన ఉందా? అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. జనవరి 31 నాటికి బిజెపి ఆర్టీఐ కన్సల్టెంట్ గంజి శ్రీనివాసరావు పేరుపై ఆర్థిక శాఖకు 27 ప్రశ్నలకు సంబంధించిన దరఖాస్తు ఇస్తే, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్, అంటే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి ఆర్టీటీ చట్టం ప్రకారం సమర్పిస్తే, వీటిపై సమాధానాలు కావాలని మరోసారి మర్చి 31న అడిగామని ఆమె తెలిపారు.
నెలరోజుల వరకు సమాధానం రాకపోవడంతో మార్చ్ 12న మొదటి అప్పీల్ దాఖలు చేశామని ఆమె చెప్పారు. మొదటి అపీల్ తర్వాత ఆర్థిక శాఖకు 27 ప్రశ్నలతో పాటు మరిన్ని వివరాలు పంపుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం మాకు ఆ జవాబులు రావాలని స్పష్టంగా డిమాండ్ చేశామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 45 రోజులు అయినా స్పందన లేదని ఆమె పేర్కొన్నారు.
అసలు తెలంగాణలో ఆర్టీఐ పనిచేయడం లేదని, ప్రస్తుతం 16,000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని రాణి రుద్రమ వెల్లడించారు. ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా బిజెపి నేతలు అడిగితేనే స్పందించకపోతే, సాధారణ పౌరులు ఎవరిని ఆశ్రయించాలి? లిఖితపూర్వక సమాధానాలు ఎలా అందాలి? అని ఆమె ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఇతర నాయకులు నిజాల లెక్కలు తెలియకుండా కేంద్రంపై నిందలు మోపుతూ అసత్య ప్రచారం చేస్తున్నరని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు తీసుకోగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ కూడా అప్పులు తీసుకుంటోందని ఆమె తెలిపారు. వాటి వివరాలను కూడా తాము 27 ప్రశ్నల్లో అడిగినా ఇంతవరకు ఏ సమాధానం రాలేదని ఆమె తెలిపారు.
నిజాలు చెప్పకపోతే, ఆర్టీఐ కూడా పని చేయకపోతే ఇక తాము ఎవరిని ఆశ్రయించాలి? అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క లేదా వారి ఆర్ధిక కార్యదర్శి, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలని రాణి రుద్రమ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, ఆర్టీఐ ప్రకారం పని చేయడం ప్రారంభించాలని ఆమె హితవు చెప్పారు. తాము ఆర్ధిక శాఖను కోరిన వివరాలను వెల్లడించాలని ఆమె స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 11 లక్షల కోట్లు అందినప్పటికీ, ఆ కేంద్ర సహాయం పూర్తిగా రాలేదని ఆ పార్టీ అతస్య ప్రచారం చేసిందని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు తీసుకుంటోందని చెబుతూ ఈ అప్పుల వివరాలను ఆర్టీఐ ద్వారా అడుగుతున్నామని ఆమె చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో ప్రభుత్వం ఉన్న శాఖలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయిందని ఆమె విమర్శించారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు