
ఉగ్రవాదంపై భారత్ సాగించే పోరులో తాము బాసటగా వుంటామని ఫ్రాన్స్, పనామా ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజాస్వామ్య దేశాలు ఒక్క తాటిపై వుండాల్సిన అవసరం వుందని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. బిజెపి నేత రవి శంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం ఫ్రాన్స్‌లో, కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం పనామాలో పర్యటించాయి.
ఈ బృందాలు తీవ్రవాదంపై పోరుకు సంబంధించి భారత ప్రభుత్వ సందేశాన్ని వారికి తెలియజేశాయి. శశిథరూర్ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం పనామా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షురాలు డానా కేస్టనెడాతో భేటీ అయింది. భారత్‌కు అవసరమైన తోడ్పాటు, మద్దతు తమ వైపు నుండి ఎల్లప్పుడూ వుంటుందని వారు హామీ ఇచ్చినట్లు శశిథరూర్ బుధవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కృత నిశ్చయంతో పోరు సాగించాల్సిందిగా వారు భారత్‌ను కోరారని తెలిపారు. అంతకుముందు శశి థరూర్ సందర్శకుల పుస్తకంలో సంతకంచేశారు. పనామాలో గల దాదాపు 300 మంది భారతీయులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, భారత్ పోరుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్ విదేశీ, రక్షణ వ్యవహారాల కమిటీలు, భారత్, ఫ్రాన్స్ మిత్రబృంద ప్రతినిధులు అఖిలపక్ష బృందంతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఫ్రాన్స్ సెనెట్‌లోని సహచరులందరూ ముక్త కంఠంతో భారత్‌కు చేయూతనందిస్తామని హామీ ఇచ్చారని రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. వారందించిన తోడ్పాటుకు, వారి సహృదయతకు కృతజ్ఞతలని ప్రసాద్ చెప్పారు. ఫ్రాన్స్‌లో కూడా ఉగ్రవాదంపై పొరాడుతున్నామని భారత్, ఫ్రాన్స్ మిత్రబృంద అధ్యక్షుడు థెర్రే టెసాన్ చెప్పారు. తీవ్రవాదమనేది కేన్సర్ వంటిదని దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందేనని సెనెట్ నేతలు పేర్కొన్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా