ఆధార్‌ తరహాలో ప్రతి ఇంటికి ‘డిజిటల్‌ అడ్రస్‌ సిస్టమ్‌’

ఆధార్‌ తరహాలో ప్రతి ఇంటికి ‘డిజిటల్‌ అడ్రస్‌ సిస్టమ్‌’
మహానగరాల్లో ఏదైనా ఒక అడ్రస్‌ కనుగొనడమంటే కత్తి మీద సాము చేయడం వంటిదే. గూగుల్‌ మ్యాప్‌ సైతం కచ్చితత్వంతో మనం కోరుకున్న చిరునామాకు మనలను తీసుకెళ్లలేకపోతున్నది. కొన్నిసార్లు మనం వెళ్లదలచుకున్న ప్రదేశాన్ని సమీపంలోని బండగుర్తు ఆధారంగా కనుగొనాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి (చిరునామాకు) ఆధార్‌ తరహాలో ఓ ప్రత్యేకమైన డిజిటల్‌ గుర్తింపు నంబర్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. 
 
దీంతో ప్రతి భారతీయుడి నివాసానికి అధికారికమైన ఓ ప్రత్యేక గుర్తింపు నంబర్‌ (డిజిపిన్‌ నంబర్‌) లభించనుంది. తాను నివసిస్తున్న ప్రదేశానికి భవిష్యత్తులో ఇదే ఐడీ ప్రూఫ్‌గా మారనుంది. నివాసాలను, ప్రదేశాలను కచ్చితంగా, వేగంగా కనుగొనే లక్ష్యంగా ఈ ప్రత్యేక డిజిటల్‌ ఐడీ నంబర్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు చెబుతున్నారు. 
ప్రస్తుతమున్న భౌతిక చిరునామాలను డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) వ్యవస్థలో అనుసంధానం చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. 
ప్రస్తుతం దేశంలో అడ్రస్‌ల డాటాను నిర్వహించేందుకు ఓ ప్రామాణికమైన వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని చాలామంది తప్పుడు అడ్రస్‌లతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ చిరునామాల డాటాకు సంబంధించి దేశంలో స్పష్టమైన నియమ నిబంధనలు అమలులో లేకపోవడంతో పలు ప్రైవేటు కంపెనీలు పౌరుల వద్ద వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వారి అనుమతి లేకుండానే ఇతరులతో పంచుకుంటున్నాయి. 
ప్రభుత్వం అమలుచేయనున్న కొత్త డిజిటల్‌ ఐడీలతో ఈ అక్రమాలన్నింటికీ అడ్డుకట్టవేయవచ్చని భావిస్తున్నారు.  డిజిటల్‌ ఐడీలతో పౌరుల వ్యక్తిగత వివరాలు వారి నియంత్రణలో ఉండిపోతాయి. ఎవరైనా ఆ వివరాలను పొందాలంటే ఇకపై సదరు వ్యక్తి అనుమతి ద్వారానే సాధ్యం కానుంది. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్‌ వ్యవస్థ జోరందుకుంది. లాజిస్టిక్స్‌, యాప్‌ ఆధారిత సేవలు (హోం డెలివరీ) విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సేవలందించేందుకు కచ్చితమైన, ప్రామాణికమైన అడ్రస్‌ల అవసరం పెరిగిపోయింది. దేశంలో ప్రస్తుతం చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటాయి. ఈ అస్పష్టత కారణంగా సేవల వితరణ ఆలస్యమై, ఒక చోట ఇవ్వాల్సిన డెలివరీని మరో చోట ఇవ్వడం, తదితర కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 10-14 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.14 లక్షల కోట్ల) నష్టం వాటిల్లుతున్నది. ఇది జీడీపీలో 0.5శాతమని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం ‘డిజిటల్‌ అడ్రస్‌ సిస్టమ్‌’ను అమలులోకి తేనున్నది. దీని ద్వారా ఏదైనా సంస్థ ఆన్‌లైన్‌లో మన చిరునామాను పొందాలంటే తప్పనిసరిగా మన అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఓ ముసాయిదా విధానాన్ని విడుదల చేయనున్నారు. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించి తుది రూపునివ్వనున్నట్టు తెలిసింది.

ఈ కొత్త అడ్రస్‌ వ్యవస్థకు డిజిపిన్‌ (డిజిటల్‌ పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌) కీలకం కానుంది. ఈ నంబర్‌ పది అంకెలు, అక్షరాలతో ఉంటుంది. కచ్చితమైన మ్యాప్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా ఓ ప్రత్యేకమైన 10 అక్షరాల కోడ్‌గా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతమున్న పిన్‌కోడ్‌ నంబర్లు పోస్ట్‌ ఆఫీస్‌ల ఆధారంగా విస్తారమైన ప్రదేశాలకు కేటాయించారు. కానీ డిజిపిన్‌లను కచ్చితత్వంతో వ్యక్తుల ఇండ్లకు లేదా వ్యాపారాలకు కేటాయించనున్నారు.