సరిహద్దుల్లో ఓ పోస్టుకు ‘సింధూర్‌’ పేరు

సరిహద్దుల్లో ఓ పోస్టుకు ‘సింధూర్‌’ పేరు
 
* ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించి మరో బిఎస్‌ఎఫ్‌ వీడియో 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్‌ లోని, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మెరుపుదాడులు చేసింది. ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్‌లోని ఓ పోస్టుకు ‘సింధూర్‌’ పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) ప్రతిపాదించింది.

మే 10న సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మే 10న పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్‌ జవాన్లు, మరో భారత సైనికుడు మరణించారని బీఎస్‌ఎఫ్‌ ఐజీ శశాంక్ ఆనంద్ తెలిపారు. 

“మే 10న మా పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్‌ దాడులకు పాల్పడింది. బీఎస్‌ఎఫ్‌ దళాలు వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్న క్రమంలో బృందంలోని బీఎస్‌ఎఫ్‌ సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సరిహద్దులోని పోస్టులకు వారి పేర్లను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం” అని శశాంక్‌ చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది ఎంతో తెగువతో ఫార్వర్డ్ పోస్టులపై పాక్‌తో పోరాడారని శశాంక్‌ ప్రశంసించారు. అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో మహిళా బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లు పాక్‌ డ్రోన్‌లను సమర్థవంతంగా తిప్పి కొట్టారని తెలిపారు.  మరోవైపు భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారడంతో ఉగ్రవాదులు భారత్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వెంబడి వారు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నట్లు చెప్పారు. కాబట్టి భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా, ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించి బిఎస్‌ఎఫ్‌ (సరిహద్దు భద్రతా దళాలు) తాజాగా మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సరిహద్దు భద్రతా దళాలు పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఏవిధమైన దాడులు చేసింది స్పష్టంగా కనిపిస్తుంది.  సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడటం, అత్యంత శక్తివంతంగా ఈ దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 

 
ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంతో పాటు సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ ఆర్మీ పోస్టులను విధ్వంసం చేయడం కూడా వీడియోలో ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూ ఫ్రాంటియర్‌ బిఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ శశాంక్‌ ఆనంద్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ భూభాగంలోని లోని, మస్త్‌పూర్‌, చాబ్రాతో సహా అఖ్నూర్‌, సాంబా, ఆర్‌ఎస్‌పురా సెక్టార్లలోని పలు ఉగ్రవాద స్థావరాలను బిఎస్‌ఎఫ్‌ ధ్వంసం చేసింది’ అని అన్నారు.