రాష్ట్ర స్థాయి మురళి నాయక్ “యువ పురస్కారం” ప్రకటించాలి

రాష్ట్ర స్థాయి మురళి నాయక్ “యువ పురస్కారం” ప్రకటించాలి
భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన తెలుగు బిడ్డ, అమరవీరుడు  మురళి నాయక్ యువతకు ఆదర్శంగా నిలిచారు. దేశ సేవలో తాను చూపిన త్యాగాన్ని స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం “మురళి నాయక్ రాష్ట్ర స్థాయి యువ పురస్కారం” ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తాండ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్, బీజేపీ నాయకులు మురళి నాయక్ గారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా పరామర్శించారు. అతని చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు సమక్షంలో మురళి నాయక్ సమాధిని సందర్శించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

ఈ సందర్భంగా బీజేపి నేతలు మాట్లాడుతూ, ఈ అవార్డు ప్రజాసేవ, సైనిక సేవ, సామాజిక సేవ, విద్య, క్రీడలు వంటి విభాగాల్లో విశిష్ట సేవలందిస్తున్న యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలిపారు. అదే విధంగా, మురళి నాయక్ స్వగ్రామం సమీపంలోని జాతీయ రహదారి కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఇది ఒక స్మారక చిహ్నంగా యువతలో దేశభక్తిని పెంపొందించే దిశగా దోహదపడుతుందని ప్రభుత్వానికి సూచించారు.

విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ కు వివరించి, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని తెలిపారు . వీర జవాన్ మురళి నాయక్ వంటి త్యాగాలను శాశ్వతంగా గుర్తుంచుకోవడం, వారిని ఆదర్శంగా నిలిపే కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు.

 
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా  నేతలు రోద్దం ఉత్తమ రెడ్డీ, బూదిలి సుదర్శన్, శ్రీనివాసులు, చంటి, నాగార్జున, హరినాయక్ , శ్రీనివాసులు నాయక్ , ప్రతాప్, మండల నాయకులు శంకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, స్థానిక నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు .