ప్రభుత్వం ఏర్పాటుకై గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ ఎమ్యెల్యేలు

ప్రభుత్వం ఏర్పాటుకై గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన మ‌ణిపూర్ ఎమ్యెల్యేలు
మ‌ణిపూర్‌ లో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు బీజేపీ నేత తోక్చ‌మ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అజ‌య్ కుమార్ భ‌ల్లాను క‌లిశారు. మ‌రో 9 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లి రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌భుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ఆయ‌న చెప్పారు.
 
గ‌వ‌ర్న‌ర్‌కు ఇదే విష‌యాన్ని చేర‌వేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం మ‌ణిపూర్‌లో ఫిబ్ర‌వ‌రి నుంచి రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు.  స్పీక‌ర్ స‌త్య‌బ్ర‌త వ్యక్తిగ‌తంగా 44 మంది ఎమ్మెల్యేల‌ను క‌లిశార‌ని, కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటును ఎవ‌రూ వ్య‌తిరేకించ‌డం లేద‌ని స్పష్టం చేశారు. 
 
ప్ర‌జ‌లు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో రెండేళ్లు కరోనాకు వెళ్లాయ‌ని, మ‌రో రెండేళ్లు వ‌ర్గ హింస చోటుచేసుకున్న‌ట్లు చెప్పారు. మైతీలు, కుక్కీలు కొట్టుకోవ‌డంతో బీజేపీ నేత ఎన్ బిరేన్ సింగ్ త‌న ముఖ్యమంత్రి ప‌ద‌వికి గత ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పట్నించి శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది.  రెండు తెగ‌ల మ‌ధ్య జ‌రిగిన పోరును ఆప‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.మ‌ణిపూర్ అసెంబ్లీ సామ‌ర్థ్యం 60 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. ప్ర‌స్తుతం ఓ ఎమ్మెల్యే మ‌ర‌ణించ‌డం వ‌ల్ల 59 మాత్ర‌మే ఉన్నారు. బీజేపీ కూట‌మిలో 32 మంది మైయితీ తెగ‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు మ‌ణిపురి ముస్లిం ఎమ్మెల్యేలు, 9 మంది నాగా వ‌ర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మొత్తం సంఖ్య 44గా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా మైయితీ తెగువ‌కు చెందిన‌వారే.

దీనిపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్‌ నిషికాంత సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.  ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపరును గవర్నర్‌కు అందజేశామని, మణిపూర్‌లోని ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. ప్రజా మద్దతును కూడా తాము కోరుతున్నామని చెప్పారు. 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, 10 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసారని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్‌ను కలిసి చర్చించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మంగళవారంనాడు తెలిపారు. గ్వల్తాబి ఘటనపై ప్రజలు ఆందోళన బాట పట్టడంతో నిరసనకారులను ఆహ్వానించి చర్చలు జరపాలని కోరినట్టు చెప్పారు. ఇంఫాల్ వ్యాలీలో గత వారం రోజులుగా గ్వల్తాబి ఘటనపై ప్రజలు నిరసనలు సాగిస్తున్నారు. ఈనెల 20న ఉఖ్రుల్ జిల్లాలోని శిరుయ్ లిల్లీ ఉత్సవ విశేషాలను కవర్ చేసేందుకు జర్నలిస్టులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సును భద్రతా సిబ్బంది ఆపారు. 

బస్సు విండ్‌షీల్డ్‌పై రాసి ఉన్న మణిపూర్ అనే రాష్ట్రం పేరు కనిపించకుండా తెల్లకాగితంతో కప్పాలని బస్సులోని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ గుర్తింపును అమానించిన గవర్నర్ క్షమాపణ చెప్పాలని నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, మణిపూర్‌ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకూ ఉంది.