జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ మిత్రులు ఐఎస్‌ఐ ఏజెంట్లే

జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ మిత్రులు ఐఎస్‌ఐ ఏజెంట్లే

పాకిస్తాన్ కోసం గూఢచర్యానికి పాల్పడి, ప్రస్తుతం కటకటాల్లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు తనను కలిసిన పాకిస్తానీ ఆపరేటర్లు నలుగురూ పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ ఏజెంట్లు అని ఆమెకు తెలుసునని పోలీసులు ధ్రువీకరించారు. జ్యోతి మల్హోత్ర నుంచి మూడు ఫోన్ల నుంచి కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

పోలీసులు రికవరీ చేసిన డేటాలో ఆమె చాట్ రికార్డులు, కాల్ వివరాలు, వీడియో ఫుటేజ్ తో పాటు నలుగురు ఏజెంట్లతో ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా కు నలుగురు పాకిస్తానీ నిఘా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. 

ఆమె పాకిస్తాన్ లో పర్యటించనప్పుడల్లా ప్రత్యేక మర్యాదలు జరిగేవని, పోలీసు అధికారి తెలిపారు. ఆమె నుంచి రికవరీ చేసుకున్న డిజిటల్ డేటా ను నిపుణులు పరిశీలిస్తున్నట్లు  ఆయన తెలిపారు. పాకిస్తాన్ అధికారి ఎహ్ సాన్ -ఉర్- రహీం అలియాస్ డానిష్ తో తనకు పరిచయం ఉందని, డానిష్ ను తాను నేరుగా కలిసి మాట్లాడానని జ్యోతి మల్హోత్రా అంగీకరించింది.

అలాగే ఇతర యూట్యూబ్ నిపుణులతో పరిచయం ఉందని తెలిపారు. ఆ మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తో పాటు హర్యానా సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఐటీ ఇన్ చార్జి హర్ కీరత్ సింగ్ కు చెందిన ఫోన్ లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.

భారతదేశ ఐక్యత, సమగ్రతకు హాని కలిగించే చర్యలకు పాల్పడినందుకు, అధికార రహస్యాల చట్టం కింద, భారతీయ న్యాయ సంహిత చట్టాలకింద జ్యోతి మల్హోత్రాపై అభియోగాలు నమోదు చేశారు. శతృ దేశానికి కీలక సమాచారాన్ని పంచుకున్నారనే అనుమానంతో జ్యోతి మల్హోత్రాతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లకు చెందిన 12 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.