
ఐదు వారాల క్రితం ఉగ్రదాడితో వణికిన జమ్ముకశ్మీర్ లోని పహల్గాం సమీపంలో ఉగ్రదాడి జరిగిన బైసరన్ లోయలో మంత్రివర్గం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశం ఉగ్రవాదులకు చేరేలా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లోని వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్ము కాకుండా వెలుపల ఇలా అక్కడి క్యాబినెట్ భేటీ కావడం ఈ నూతన ప్రభుత్వ హయాంలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ప్రకృతి అందాలకు నెలవైన పహల్గాంలోని బైసరన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు బలయ్యారు. దాంతో అప్పటి నుంచి పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకంపైనే ఆధారపడిన స్థానిక ప్రజలకు సంఘీభావంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఒమర్ మీడియాకు వెల్లడించారు. “మేం ప్రజల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పహల్గాంకు వచ్చాం. ఆ దిశగా చర్యలు కొనసాగుతాయి” అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా పిరికిపంద చర్యలకు భయపడేది లేదనే స్పష్టమైన సందేశాన్ని పంపినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పర్యాటకాన్ని సంఘర్షణలకు అతీతమైన కార్యకలాపాలుగా పరిగణించాలని, రాజకీయ సాధనంగా కాదని చెప్పారు. ”పర్యాటకం అనేది ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినది. జీవనోపాధికి మార్గం. ప్రతీసారీ జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం రాజకీయాలకు బలవుతునే వస్తోంది. ఈ పరిస్థితి నుండి పర్యాటక రంగాన్ని తప్పించాలన్నదే మా ప్రభుత్వ అభిమతం. ఇతర అంశాలతో సంబంధం లేకుండా పర్యాటక రంగాన్ని జీవనోపాధి మార్గంగానే అందరూ చూడాలి.” అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గత వారం ఉన్నత స్థాయి వాటాదారుల సమావేశం నిర్వహించిన సమయంలో పర్యాటక రంగానికి మద్దతు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. “నేను ఇటీవల ఢిల్లీలో ఉన్నాను. నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రిని కలిసే అవకాశం నాకు లభించింది. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక పరిశ్రమ పరిస్థితి గురించి నేను ఆయనకు వివరించాను. ఆయన పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు” అని అబ్దుల్లా తెలిపారు.
గత వారం కేంద్ర స్థాయిలో జరిగిన సమావేశంలో పర్యాటక పునరుద్ధరణకు విస్తృతమైన రూపురేఖలను చర్చించామని ఆయన పేర్కొన్నారు. “కేబినెట్ ఇక్కడ సమావేశమై ప్రభుత్వ ఎజెండా గురించి చర్చించింది, కానీ ప్రజలు ఉగ్రవాద హింసకు భయపడరని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం మా సంకల్పం కొనసాగుతుందని నిరూపించడానికే క్యాబినెట్ సమావేశం జరిగింది” అని ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత తన మొదటి విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
ఈ దాడిలో ప్రధానంగా పర్యాటకులు 26 మందిని కాల్చి చంపారు. ‘ఎక్స్’లో ఒక సందేశంలో, ఆయన కార్యాలయం ఇది కేవలం ఒక సాధారణ పరిపాలనా పక్రియ కాదని, “మేము పిరికి ఉగ్రవాద చర్యలకు భయపడము” అని స్పష్టమైన సందేశం ఇవ్వడం కోసమే అని పోస్ట్ చేసింది. “శాంతి శత్రువులు మన సంకల్పాన్ని ఎప్పటికీ నిర్దేశించరు. జమ్మూ కాశ్మీర్ దృఢంగా, బలంగా, నిర్భయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
పహల్గాం క్లబ్‌లో జరిగిన మీటింగ్ దృశ్యాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏ మాత్రం భయపడేదిలేదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చామని, జమ్ముకశ్మీర్ దృఢంగా నిలబడుతుందని ఆ పోస్టులో రాసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో హింసకు స్థానం లేదని దేశ వ్యతిరేకులు, సామాజిక వ్యతిరేక శక్తులకు ప్రత్యక్ష సందేశం ఇవ్వడంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంచరించుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కాగా 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒమర్ అబ్దుల్లా ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్‌ధర్, జమ్ము ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లో ఇలా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ తరహా చర్యలు స్థానిక ప్రజల్లో భయాలను తొలగిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.
కాగా 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒమర్ అబ్దుల్లా ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్‌ధర్, జమ్ము ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లో ఇలా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ తరహా చర్యలు స్థానిక ప్రజల్లో భయాలను తొలగిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన