
దేశంలోని నాలుగు హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల బదిలీకి సుప్రీంకోర్టు కోలిజియం సిఫార్సు చేసింది. రాజస్థాన్, త్రిపుర, ఝార్ఖండ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కల్పించాలని ఈ మేరుకు కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అధ్యక్షతన మే 26న జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు.
జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవను రాజస్థాన్ నుంచి మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను త్రిపుర నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఝార్ఖండ్ నుంచి త్రిపుర హైకోర్టుకు, జస్టిస్ కేఆర్ శ్రీరామ్ మద్రాస్ నుంచి రాజస్థాన్ హైకోర్టుకు, తెలంగాణ సీజే తడకమల్ల వినోద్ కుమార్‌ను మద్రాస్ సీజేగా బదిలీ చేయాలని కోలిజియం ప్రతిపాదనలు చేసింది.
జస్టిస్ టి.వినోద్ కుమార్ నవంబర్ 17, 1964లో జన్మించారు. తన ప్రాథమిక విద్యను నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో పూర్తి చేశారు. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2015లో ఇన్కమ్ ట్యాక్స్ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్, 2016లో వాణిజ్య పన్నుకు స్టాండింగ్ కౌన్సిల్లో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఆగష్టు 26, 2019న ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే, తెలంగాణకు సీజేగా బదిలీకి సిఫార్సు చేసిన అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఆ తర్వాత 10ఏళ్ల పాటు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసిన సింగ్ 2023 ఏప్రిల్‌లో త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు.
అంతకు ముందు దేశంలో 11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. కొలీజియం చేసిన ప్రతిపాదనల్లో ఏపీ, తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు కూడా ఉన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్‌ను మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి ప్రతిపాదన చేసింది.
కర్ణాటక హైకోర్టు నుంచి ఇద్దరు, పట్నా హైకోర్టు నుంచి ఒకరిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత, జస్టిస్ లలితలను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిని కూడా తెలంగాణ హైకోర్టుకు పంపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
తెలంగాణ హైకోర్టులో ఉన్న జస్టిస్ సుజల్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కోలిజియం పంపిన సిఫార్సులను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఈ బదలీలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం