
హమాస్ పై యుద్ధం పేరుతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్నది. రక్తపుటేరులు పారిస్తూ ఆహార కొరత కారణంగా కరువు ఎదుర్కొంటున్న గాజాలో 77 శాతం ప్రాంతాన్ని ఇజ్రాయిల్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. తాజాగా సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమం, దురాగతాలపై తక్షణమే స్పందించాలని పాలస్తీనా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అత్యవసర సహాయం తీసుకువెళ్ళే ట్రక్కులను అనుమతించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించినప్పటికీ, అతి తక్కువ సహాయం మాత్రమే గాజాకు చేరుకుంటుందని పేర్కొంది. ఇజ్రాయిల్ సైన్యం తన దాడులను తీవ్రతరం చేయడంతో, గాజాలోకి సరిహద్దు దాటడంలో వాహనాలు అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా గాజాలో ఆకలి, పోషకాహార లోపం కారణంగా మరిన్ని మరణాలు సంభవించాయని వెల్లడించింది. గత శుక్రవారం కూడా ఇజ్రాయెల్ సైన్యం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి జరిపింది.
గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే డాక్టర్ తన 10 మంది పిల్లలతోపాటు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దాడి జరగడంతో ఆ పిల్లల్లో తొమ్మిది మంది మృతిచెందారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు ఈ పోరులో 53 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. వారిలో 16,500 మందికిపైగా చిన్నారులే ఉన్నారు.
హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేయడమేగాక, వారి వద్ద బందీలుగా ఉన్న 53 మంది తమ దేశ పౌరులను విడిపించేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిజ్ఞ బూనింది.“ఇటీవల జరిగిన ఇజ్రాయిల్ దాడి ఫలితంగా 1,010 కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 2,620 కుటుంబాలలో ఒకటి మాత్రమే మిగిలి ఉన్నారు. 4,126 కుటుంబాలలో, రెండు కంటే ఎక్కువ మంది లేరు” అని మానవ హక్కుల కార్యకర్త రామి అబ్దేల్ అజీజ్ వెల్లడించారు.
గాజాలో రెండు నెలల్లో 950 మంది పిల్లలు మరణించారని యుఎన్ శరణార్థి సంస్థ (యుఎన్ ఆర్డబ్ల్యూఏ) తెలిపింది. గాజాపై విచక్షణారహిత దాడుల నుండి ఇజ్రాయిల్ వైదొలిగి పిల్లలను రక్షించాలని ఏజెన్సీ పిలుపునిచ్చింది. దీనికి ముందురోజు, గాజాలో ఇజ్రాయిల్ ఊచకోత గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ముందు వరుసలో పనిచేసిన “చైల్డ్ జర్నలిస్ట్” ఇజ్రాయిల్ దాడిలో మరణించాడు. బాధితుడు డీర్ అల్-బాలాకు చెందిన యాకీన్ అహ్మద్ గా గుర్తించారు.
ఇజ్రాయిల్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో యుఎఈ సహాయాన్ని తీసుకువెళుతున్న ట్రక్కులపై దాడి చేసి దోచుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. 103 ట్రక్కులను లోపలికి అనుమతించాలని అంగీకరించారు, కానీ 24 ట్రక్కులను మాత్రమే అనుమతించారు. వీటిలో ఒక ట్రక్కు వస్తువులు మాత్రమే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. మిగిలిన ట్రక్కులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
More Stories
`బ్లాక్ ఎవ్రీథింగ్’ పేరుతో ఫ్రాన్స్ లో పెద్దఎత్తున నిరసనలు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం