జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

* పాక్ లో రాచమర్యాదలు.. గన్‌మెన్లు ఏకే 47తో భద్రత 

పాకిస్తాన్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను పోలీసులు హిసార్‌ కోర్టుకు తరలించగా సివిల్ జడ్జి సునీల్ కుమార్ ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆమెను హిసార్ సెంట్రల్ జైలు నంబర్-2లో ఉంచనున్నారు. ఇది మహిళల జైలు.
విచారణ సమయంలో కోర్టు లోపల గేట్లు మూసివేశారు. 
 
భారీ పోలీసు బలగాలను మోహరించారు. జ్యోతిని గతంలో ఐదు రోజుల రిమాండ్‌కు తరలించగా, తాజాగా గడువు ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచారు.  మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌‌ తాజాగా నివేదిక ఇచ్చింది. ఆమెకు పాక్‌తో సంబంధాలున్నాయనడానికి కచ్చితమైన సాక్ష్యాలున్నాయని ఫోరెన్సిక్ పరిశీలనలో తేలినట్టు సమాచారం.
 
జ్యోతి మల్హోత్రా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి 12టీబీ డిజిటల్ డాటా రికవరీ చేశామని పోలీసు వర్గాలు తెలిపాయి. కనీసం నలుగురు పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐఓ)తో ఆమె ముఖాముఖి సంభాషణలు జరిపినట్టు ఫోరెన్సిక్ విశ్లేషణ చెబుతోందని తెలిపారు. ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. 
 
పాకిస్థాన్‌లో పర్యటించనప్పుడల్లా ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారనడానికి సాక్ష్యాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది.
కాగా, మల్హోత్రాకు విదేశాల నుంచి నిధులు అందేవనే సమాచారంపై ఇంకా ఒక నిర్దారణకు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఈ దశలో పోలీస్ రిమాండ్ కోరలేమని హిసార్ పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిజిజల్ సాక్ష్యాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అయితే సరైన సమయంలో మల్హోత్రాను అరెస్టు చేయడం వల్ల కీలక జాతీయ భద్రతా సంక్షోభం తలెత్తకుండా నివారించగలిగామని అన్నారు.

పాక్‌ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌ పర్యటనలో అక్కడి అధికారులు రాచమర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌ని సందర్శించిన సమయంలో యూట్యూబర్‌కు ఏకంగా ఆరుగురు గన్‌మెన్లు ఏకే 47తో భద్రత కల్పించినట్లుగా తేలింది. 

స్కాట్లాండ్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతికి కల్పించిన సెక్యూరిటీని చూసి స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘కాలమ్ అబ్రాడ్’ అనే యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాక్‌లో పర్యటించారు. లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్‌లో తిరుగుతుండగా అక్కడ కొందరు తుపాకులతో కనిపించారు. వారి చొక్కాలపై ‘నో ఫియర్’ అని రాసి ఉంది.

వారితో జ్యోతి మల్హోత్రా వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. కాలమ్ మిల్ తనను తాను పరిచయం చేసుకుని, పాకిస్తాన్‌కు రావడం ఇది ఐదోసారని చెప్పింది. జ్యోతి తాను భారతీయురాలినని పరిచయం చేసుకోగా పాక్ ఆతిథ్యంపై ప్రశ్నించారు. ‘చాలా బాగుంది’ అంటూ జ్యోతి బదులిచ్చింది. 

జ్యోతి మల్హోత్రా ముందుకు వెళ్తున్న సమయంలో ఆ సాయుధ వ్యక్తులు ఆమెతోనే ఉన్నారని కాలమ్ మిల్ గుర్తించి ఆమెకు తుపాకులతో అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏంటీ? అంటూ వీడియోలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలమ్ మిల్ ఎలాంటి భద్రత లేకుండా ఒక్కరే తిరగ్గా, జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ భద్రత ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది. 

అయితే, సాయుధులు యూనిఫాంలో లేనప్పటికీ మఫ్తీలో ఉన్న భద్రతా సిబ్బంది అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వీడియోతో జ్యోతికి పాకిస్తాన్‌లో ఎలాంటి పరిచయాలు ఉన్నాయో తెలుస్తున్నది. పాక్‌లో ఉన్నతస్థాయి పార్టీలకు హాజరై, అక్కడి భద్రత, నిఘా అధికారులను కలిసినట్లు అనుమానిస్తున్నారు. భారత్‌కు తిరిగివచ్చాక సైతం వారికి టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.