కర్తవ్యనిష్టతో కర్మయోగిగా జీవించి, స్వయంసేవక్‌గా విలువల నడుమ ప్రస్తానాన్ని సాగించిన స్వర్గీయ స్థానం భావనారాయణ ఎందరికో మార్గదర్శిగా నిలిచారని శ్రద్ధాంజలి సభ కొనియాడింది. హైదరాబాదులోని కేశవ మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటైన ఈ సభలోని వక్తలు భావనారాయణ ఆదర్శవంతమైన జీవనాన్ని స్మరించుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్వయంసేవక్ అయిన భాగ్యనగర్ మహానగర్ శారీరిక్ ప్రముఖ్ గాను, పశ్చిమాంధ్ర ప్రదేశ్‌కు ఆరేళ్ళు సహకార్యవాహగాను బాధ్యతలు నిర్వర్తించారు.
1969 నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్)లో వివిధ స్థాయుల్లో పనిచేశారు. ఈ సంస్థకు అనుబంధ పెడరేషన్ అయిన నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్కర్స్ యునియన్ అఖిల భారత అధ్యక్షులుగాను, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సహకార్యదర్శిగానూ సేవలందించారు. మే 10వ తేదీన తుదిశ్వాస విడిచిన భావనారాయణ సేవలను ఆర్ఎస్ఎస్, బిఎంఎస్, కేశవ మెమోరియల్ విద్యా సంస్థల్లో ఆయనతో కలసి పనిచేసిన ముఖ్యులు, సహచరులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సంఘ్ మార్గదర్శకత్వంలో సఫల జీవనం గాక సార్ధక జీవనాన్ని గడిపిన వ్యక్తి అయిన భావనారాయణ తొలుత సంఘ్, ఆ తర్వాత బిఎంఎస్.. ఇలా ఎక్కడ బాధ్యతలను నిర్వహించినప్పటికీ స్వయంసేవక్‌గా అందరి హృదయాలలోనూ నిలిచారని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీరాం భరత్ కుమార్ తెలిపారు. సాధారణ వ్యక్తులకు ధ్యేయాన్నిచ్చి తీర్చిదిద్దిన సంఘ్‌లోని ఉత్తమ వ్యక్తులలో భావనారాయణ ఉన్నారంటూ నిష్కామకర్మకు వీరిని గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు.
సంఘంతో ఉన్న సంబంధం కారణంగా మూడు సార్లు ఉద్యోగావకాశాన్ని కోల్పోయినప్పటికీ ఏ మాత్రం బాధపడని వ్యక్తిత్వం ఆయనదని చెప్పారు. భౌతిక ఆస్తులను గాక హృదయాలలో సంఘ్‌ని నిలుపుకున్న కార్యకర్తలనే తన ఆస్తిగా సంఘ్ భావిస్తుందని, భావనారాయణ అలాంటి స్థానం సంపాదించుకున్నారని భరత్ కుమార్ ప్రశంసించారు.
ద్రవాన్ని ఏ ఆకారంలో ఉన్న పాత్రలో పోసినా అందులో ఒదిగిపోయి ఆ రూపాన్ని స్వీకరించినప్పటికీ తన ధర్మాన్ని, స్వభావాన్ని మార్చుకోదని, భావనారాయణ కూడా తమ బాధ్యతలు, కర్తవ్యం విషయంలో అలాగే ఉండేవారని తెలిపారు. బాపట్లలోని తన ఆస్తిని సంఘ్ కోసం ఇవ్వాలనుకున్నప్పుడు బేషరతుగా ఆపని చేశారంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.
కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు జస్టిస్ నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ఏ బాధ్యత చేపట్టినప్పటికీ పరిపక్వతతో నిర్వహించడం భావనారాయణగారి ప్రత్యేకతగా చెప్పారు. ఆయన బీఎంఎస్ బాధ్యతల్లో ఉన్నప్పుడు కార్మికులు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా, ఉద్యోగుల సంక్షేమం కోసం కృతనిశ్చయులై ఉండేవారని చెప్పారు. కార్మికరంగంలో వామపక్షవాదులను ఎదుర్కోవడం కోసం బిఎంఎస్‌లోకి రానవసరం లేదన్న దత్తోపంత్ ఠేంగ్డీ మనోభావాలను గ్రహించి పాజిటివ్ లేబర్ మూమెంట్ లక్ష్యంగా భావనారాయణ ముందుకెళ్ళి విజయవంతమయ్యారని తెలిపారు.
సామాజిక సమరసత మంచ్ అఖిలభారత సంయోజకులు శాం ప్రసాద్ నివాళులు అర్పిస్తూ రాం సాఠే మార్గదర్శకత్వంలో భావనారాయణ బాల స్వయంసేవక్ రోజుల నుంచి పొందిన వికాసాన్ని తెలిపారు. సంఘ్ 100 ఏళ్ళ నేపథ్యంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు. ఆయన ఆరు దశాబ్దాల కాలం పాటు సంఘ్‌లోను, బిఎంఎస్‌లోను విరామమెరుగక పనిచేశారని, ప్రత్యేకించి ఎల్ఐసీ సంస్థలో మేనేజిమెంట్ స్థానానికి చేరుకున్నప్పుడు ఉద్యోగుల భద్రతను పట్టించుకున్నారని తెలిపారు.
సాధారణంగా ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఉద్యోగుల హక్కులను హరించడం చూస్తుంటామని, అయితే, భావనారాయణ అందుకు భిన్నంగా ఉద్యోగుల క్షేమాన్ని కాంక్షించేవారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని వెల్లడించారు. 2003లో గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఏర్పాటులో సైతం ఆయన కీలకపాత్ర పోషించి ఎన్నో విషయాల్లో బహుముఖంగా ప్రతిభను కనబరిచేవారని శ్యాం ప్రసాద్ తెలియజేశారు.
బిఎంఎస్ అఖిలభారత ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం మాట్లాడుతూ భావనారాయణ ప్రధానకార్యదర్శిగా ఉన్న రోజుల్లో బిఎంఎస్ సంస్థాగత నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్, బీమా రంగ సంస్థల్లో లెఫ్టిస్ట్ కార్మిక సంఘాలను తట్టుకుని మరో కార్మిక సంఘాన్ని నెలకొల్పడం ఎంతో కష్టమంటూ భౌతిక దాడులను సైతం ఎదుర్కొనాల్సిన పరిస్థితులుంటాయని వివరించారు.
అలాంటి పరిస్థితుల్లో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శిగా భావనారాయణ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపేవారని, ఉద్యోగులు – కార్మికులలో అనేక విషయాలపై అవగాహన కల్పించేవారని, ఆయన హయాంలోనే బిఎంఎస్ మహాసభలను కూడా ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. భావనారాయణ అవిరళ కృషికి గాను 1985లో జరిగిన జెనీవా కన్వెన్షన్‌కు కూడా ఆయన్ని పంపారని తెలిపారు.
వనవాసీ కళ్యాణాశ్రమం అఖిలభారత అధికారి కె.రామచంద్రయ్య శ్రద్ధాంజలి ఘటిస్తూ సాఠేజీ మార్గదర్శకత్వాన్ని అందిపుచ్చుకుని రాణించిన కొద్దిమంది చురుకైనవారిలో భావనారాయణ ఒకరని చెప్పారు. ఆయన బిఎంఎస్ బాధ్యతల్లో ఉన్నప్పుడు వామపక్షవాదుల చేతుల్లో నలిగిపోయిన తన కార్యకర్తకు భావనారాయణ అండదండలు అందించి రక్షించేవారని చెప్పారు. వారు అనారోగ్యానికి గురై కదలలేని పరిస్థితి వచ్చేవరకూ ప్రతి నిత్యం శాఖకు వెళ్ళి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారని తెలిపారు.
విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగం సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ భావనారాయణ ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు బాధ్యత తీసుకుని స్వంత పనిగా రేయింబవళ్లూ శ్రమించి కార్యసాధకునిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనదని పేర్కొన్నారు. శరీరం సహకరించని రోజుల్లో ఆ స్థితిలోనూ ఏ సంస్థకైనప్పటికీ తాను ఎలా ఉపయోగపడగలననే ఆలోచనతోనే ఉండేవారని తెలిపారు. విద్యాపీఠానికి తమ శ్రీమతికి చెందిన ధనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, తన వంత సహకారం అందించేందుకు ఒక ప్లాట్‌ని సైతం అమ్మే ఆలోచన చేశారని భావనారాయణ ఔన్నత్యాన్ని తెలియజేశారు.
ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ గొట్టుముక్కల భాస్కర్ మాట్లాడుతూ తుది వరకూ సంఘ కుటుంబంగానే ఉన్న భావనారాయణని అనారోగ్యం సమయంలో కుటుంబం ఎంతగా ప్రేమను అందించిందో వివరించారు. సాఠే గారి ప్రభావంతో సమర్ధవంతుడైన కార్యశీలిగా ఎదిగారని, ఎంత తీరిక లేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆత్మీయ పలుకరింపును ఆయన విడనాడేవారు కాదని ప్రశంసించారు.
ఇంకా స్వర్గీయ భావనారాయణ గారితో కలసి సంఘ్‌లోను, ఎల్ఐసీలోను, బిఎంఎస్‌లోను, కేశవ మెమోరియల్ సంస్థల్లోను పనిచేసిన ఉద్యోగులు, సన్నిహితులు మాట్లాడి తమ ఆత్మీయ అనుభూతులు, అనుభవాలను పంచుకున్నారు. చివరిగా పుష్పాంజలితో శ్రద్ధాంజలి సభ ముగిసింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు