
తిరుమలలో భక్తులకు ఏఐ అధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందు కోసం టీటీడీ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. ప్రతీ కంపార్ట్ మెంట్ వద్ద ఏఐ కెమేరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ ముఖ చిత్రాలను నమోదు చేస్తోంది. ఏఐ సేవల కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ కేటాయించనున్నారు.
ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ద్వారా దర్శనం, వసతి తో పాటుగా సేవల్లో నూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యత గా టీటీడీ గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉచితంగా అందించేలా గుగూల్ ఇప్పటికే తమ సంసిద్దత వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ వినియోగించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురైన అనుభవాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు.
దర్శనం, వసతి కల్పనలో ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐ వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గుగూల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది? అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది.
దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు. ఏఐ కెమేరాలను తిరుమలలో గుగూల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది.
దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక, ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది.
తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తులు సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలను అందించే అవకాశం ఇవ్వనున్నారు.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు