
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ- కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, నెలాఖరులో అమెరికా, యూకే పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని, ఫార్ములా ఈ కేసుపై ఏసీబీకి లిఖితపూర్వక సమాచారమిచ్ఛిన్నట్లు కేటీఆర్ తెలిపారు.
కాగా ఫార్ములా ఈ కేసులో గతంలో కేటీఆర్ సహా అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి లను ఏసీబీ విచారించింది. మరో వైపు ఈడి సైతం ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తోంది. రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని, రాజకీయ కక్ష కోసం తహతహలాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు.
48 గంటల క్రితం ఈడీ ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు వచ్చిందని, 24 గంటల క్రితమే ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలను రేవంత్ కలిశారని, ఇవాళ తనకు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మనీలాండరింగ్‌లో రేవంత్ ప్రమేయంపై బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదని పేర్కొంటూ రేవంత్ నాయకుడిగా, పాలకుడిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు.
కాగా, ఫార్ములా- ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ఆయన అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. కల్పిత కేసులు న్యాయస్థానాల్లో నిలవవని, ప్రజా ఆమోదాన్ని పొందవని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్‌కు అండగా నిలుస్తామని, సత్యమే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానమని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందని ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని ఆమె ఆరోపించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా, తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత వెల్లడించారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల