
మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు డీజీ శిఖాగోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు సీనియర్ ఐపీఎస్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్‌బీ డీసీపీ సాయి శ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతన్నదిపై దర్యాప్తులో తేలనుంది.
కాగా, మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలగడం కలకలం రేపింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో అభ్యర్థి ఇలా మధ్యలో వైదొలగడం ఇదే తొలిసారి. బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలగింది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడీవేడి చర్చ నడుస్తోంది.
24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం, హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ఇప్పుడు ఆమె హఠాత్తుగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ లోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధ్య వయస్కులైన మగ అతిథులను అలరించమని అడిగిన తర్వాత, పోటీ అధికారులు తనను అగౌరవపరిచిన తర్వాత తాను దోపిడీకి గురైనట్లు ఆమె ఆరోపించారు.
ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన స్పాన్సర్లను “వినోదం” చేయాలని తనకు, ఇతర పోటీదారులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. “ఆరుగురు అతిథులు ఉన్న ప్రతి టేబుల్ వద్ద ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మేము సాయంత్రం మొత్తం వారితో కూర్చుని వారికి కృతజ్ఞతలు తెలుపుతామని ఆశించారు” అని ఆమె చెప్పింది. “ఇది చాలా తప్పు అని నేను అనుకున్నారు. వారు నన్ను వేశ్యలా భావించేలా చేశారు” ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్‌తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, మిస్‌వరల్డ్ పోటీలపై వస్తున్న ఆరోపణలను పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తోసిపుచ్చారు. మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలను ప్రచురించిన టాబ్లెయిడ్‌కు అంతగా ప్రాముఖ్యత లేదన్న ఆయన, అయినప్పటికీ నిజాలను తెలుసుకునేందుకు పోటీదారులతో మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చారు. మిస్ వరల్డ్ నిర్వహణ పట్ల పోటీదారులు సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు