107 సంవత్సరాల తర్వాత ముంబైలో మేలో భారీ వర్షం

107 సంవత్సరాల తర్వాత ముంబైలో మేలో భారీ వర్షం
ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో గత 75 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయి. ఫలితంగా 107 సంవత్సరాల రికార్డు బద్దలయ్యింది. మే మాసంలో 107 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం కురిసింది. ముంబయికి నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ 11 వరకు వస్తుండగా ఈ సారి మాత్రం 16 రోజుల ముందుగానే వచ్చాయని తెలిపింది. 

భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త సుష్మా నాయర్ మాట్లాడుతూ గతంలో నైరుతి రుతుపవనాలు తొలిసారిగా 1956 మే 29న ముంబయికి ముందస్తుగా చేరాయని, ఆ తర్వాత 1962, 1971లో అదే రోజుల్లో వచ్చినట్లుగా పేర్కొన్నారు. రుతుపవనాల ఆగమనంతో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల మధ్య కొలాబాలో 105.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 

ఆ తర్వాత శాంటాక్రూజ్ (55 మిల్లీమీటర్లు), బాంద్రా 68.5, జుహు విమానాశ్రయం 63.5, చెంబూర్ 38.5, విఖ్రోలి 37.5 , మహాలక్ష్మి 33.5, సియోన్ 53.5లో మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయినట్లు వాతావరణశాఖ తెలిపింది. జడివాన కారణంగా ముంబయిలోని అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్‌లు నీటితో నిండిపోయాయి. దాంతో ఉదయం రోడ్లు, స్థానిక రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. 

బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ముంబయిలో కొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లోని మసీదు, బైకుల్లా, దాదర్, మాటుంగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్లలో భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లు నీట మునిగాయి. కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టీటీ ఈస్ట్, పరేల్ టీటీ, కలచౌకి, చించ్పోక్లి, దాదర్ స్టేషన్ వంటి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. 

సెంట్రల్ రైల్వే హార్బర్ లైన్‌లోని వడాలా రోడ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య సబర్బన్ రైలు సర్వీసులు ఉదయం 10.25 గంటల నుంచి నిలిచిపోయాయి. వర్షం కారణంగా దృశ్యమానత తగ్గిందని.. ఫలితంగా ట్రాఫిక్‌ నెమ్మదించిందని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలో అలలు 4.75 మీటర్లకు పెరగవచ్చని బీఎంసీ పేర్కొంది. సాయంత్రం 5.18 గంటలకు 1.63 మీటర్లు, మంగళవారం ఉదయం 5.21 గంటలకు 0.04 మీటర్ల వరకు అలలు పెరిగే అవకాశం పేర్కొంది.