రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాజీ వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. ఏపీ పోలీసులు ఆదివారం నాడు కేరళలో తలదాచుకున్న కాకాణిని అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో కాకాణిపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. సోమవారం ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు పోలీసులు.
వైఎస్సార్సీపీ హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారు. దీనిపై మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీన పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారని తెలిపారు.
కాగా, కాకాణి ఇదే సమయంలో బెయిల్ కోసం కూడా విఫలయత్నాలు చేశారు. ఆయనకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు.
అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ, కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై గతంలో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. .అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు సమాచారం సైతం ఇచ్చారు. దీంతో వేరేమార్గం లేక కేరళలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.
కాకాణి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్‌కి వెళ్లిన పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.
గత కొంతకాలంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టుకోవడం కోసం పోలీసులు కాకాణి బంధువుల ఇళ్ళు, ఫామ్ హౌస్ లలో గాలిస్తున్నారు. పోలీసుల నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాదులో కొంతకాలం, బెంగళూరులో కొంతకాలం, ఇలా తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించి ఆయన కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా