పోలవరం నుంచి ఎత్తిపోతలకు తెలంగాణ అభ్యంతరం

పోలవరం నుంచి ఎత్తిపోతలకు తెలంగాణ అభ్యంతరం
 
* గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోండి 
 
పోలవరం నీటిపారుదల డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు గోదావరి బోర్డుతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ)కి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) జి అనిల్‌కుమార్‌ లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్టు ఏప్రిల్‌ ఎనిమిదిన జరిగిన పిపిఎ సమావేశంలో పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపినా, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సన్నాహాలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. 
 
కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని వివరించారు. దీంతో గోదావరి డెల్టా వ్యవస్థ ప్రయోజనాలకు కూడా నష్టం వస్తుందని తెలియజేశారు. ప్రధానంగా పోలవరం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని పోత్తిపోయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ మాత్రం డెడ్‌స్టోరీజీ నుంచి కొత్తగా ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించడం ఎంతవరకు సమంజమని అభ్యంతరం చెప్పారు. 
 
డెడ్‌స్టోరేజీ నుంచి ఎత్తిపోతల చేపట్టడం సిడబ్ల్యుసి మార్గదర్శకాలు, అనుమతులకు విరుద్ధమని పేర్కొన్నారు. సిడబ్ల్యుసి వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ను అడ్డుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులకు ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉందని లేఖలో వివరించారు. తక్షణమే గోదావరి నదీ యాజమాన్య బోర్డుతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ముందుకు పోకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు.

మరోవంక, ఎపి ప్రభుత్వం గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టు కొత్త ప్రతిపాదనలను అడ్డుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు, చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి)లకు అనిల్ కుమార్ లేఖ రాశారు. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ పలు సందర్భాల్లో ఈ అంశంపై తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖ ద్వారా వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఏపి ప్రభుత్వం గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టు కొత్త ప్రతిపాదనలు, అందుకు అయ్యే బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్లుగా ఈనెల 22వ తేదీన ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త ప్రతిని ఆలేఖకు జత చేశారు. గోదావరి బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.