సైనిక దళాల పరాక్రమంకు ఎన్డీయే సీఎంల జేజేలు

సైనిక దళాల పరాక్రమంకు ఎన్డీయే సీఎంల జేజేలు
ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా సైనిక దళాలు చూపిన పరాక్రమాన్ని, ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని ప్రతిపాదించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కొనియాడారు. 
 
ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సైనిక దళాలకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులకు, వారిని పెంచిపోషిస్తున్న వారికి గట్టి గుణపాఠం చెప్పినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌, జాతీయ కుల గణనపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జేపీ నడ్డా చెప్పారు. 
ఆపరేషన్‌ సిందూర్‌లో సైనికదళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను, పరాక్రమాన్ని ఈ సమావేశం ప్రశంసించినట్లు తెలిపారు. “నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అందరికంటే ముందే చేసిన తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ కులగణనపై తీర్మానం ఆమోదించాం. ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసించటంతోపాటు మద్దతు ఇవ్వాలని తీర్మానించాం” అని నడ్డా చెప్పారు. 
 
“ఈ విషయాన్ని రాజకీయం చేయటం లేదని ఈ తీర్మానం ద్వారా స్పష్టంచేశాం. కానీ వంచిత, పీడిత, అణగారిన, దళితులు, వెనుకబడినవర్గాలను ప్రధాన స్రవంతిలోకి తేవటమే లక్ష్యం. ఆపరేషన్‌ సిందూర్‌లో సైనిక దళాలు ధైర్య సాహసాలు ప్రదర్శించాయని ప్రధాని మోదీ చెప్పారు. శరవేగంతో వికసిత్‌ భారత్‌ కోసం పనిచేయాలని, బలోపేతం కావటంతోపాటు సాధికారత సాధించటంపై దృష్టి సారించాలని ప్రధాని చెప్పారు” అని నడ్డా వివరించారు.

ఆదివారం ఒక్కరోజు జరిగే ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మినహా 19 ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

వారిలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉత్తర​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, త్రిపుర సీఎం మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ మాఝి, హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు.