
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి,
ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ
“మన దేహాంలో అనారోగ్యానికి కారమణయ్యే వైరస్ చేరినప్పుడు ఖచ్చితంగా ఆ వైరస్‌ను నిర్మూలించాల్సిందే. మన దేశంలో ఉన్నాయి కాబట్టి అవి మంచివే, పెంచుకుందామంటే చివరికి మన దేహాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది”. మన దేహాన్ని మన దేశంగా పోల్చుకుంటే మన దేశంలో వైరస్ లాంటి కొన్ని కొని చెడు వ్యవస్థలు బలంగా పెనవేసుకుపోయాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటిపై నిర్లక్ష్యం చూపించాయి. రాజకీయ ప్రయోజనాలు, ఇతర కుట్రల కారణం అలాంటి వైరస్‌లను కాపాడుతూ వచ్చారు.
ఫలితంగా దేశం ఎంతో అస్థిరతకు గురైంది. అలాంటి వైరస్లలో ప్రధానమైనది మావోయిజంగా మారిన నక్సలిజం. ఇప్పుడీ నక్సలిజానికి చివరి రోజులు వచ్చాయి. అగ్రనేతలందర్నీ బలగాలు మట్టుబెడుతున్నాయి. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా విదేశీ శక్తుల నుంచి ఆయుధాలు పొంది భారత్ పైనే యుద్ధం ప్రకటించిన ఈ నక్సల్స్ అంతానికి కేంద్రం పంతం పట్టింది.
దేశ రక్షణకు సరిహద్దుల్లో ఎంత భద్రత అవసరమో అంతర్గతంగా అంత కంటే ఎక్కువ భద్రత అవసరం. శత్రుదేశాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి మన దేశానికి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ అంతర్గత శత్రువులను నియంత్రించడం అంత తేలిక కాదు. వారు చేసే కుట్రలను కనిపెట్టి దేశాన్ని, పౌరులను కాపాడుకోవడం చిన్న విషయం కాదు. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామన్న పిచ్చి ఆలోచనలతో నక్సలైట్లు అడవుల బాట పట్టారు. మావోయిస్టులుగా పేరు మార్చుకుని నరమేథం చేస్తున్నారు. అసలు ఎందుకు చంపుతున్నారో వారికీ తెలియదు.
వేల మంది అమాయక పోలీసుల్ని, పౌరుల్ని హతమార్చారు. ఎంతో మందిని చంపడానికి కుట్ర పన్నారు. వీరికి మద్దతుగా అర్బన్ నక్సల్స్ ఉన్నారు. ఈ అర్బన్ నక్సల్స్ కాలేజీల్లో, యూనివర్శిటీల్లో, ఇతర చోట్ల నక్సల్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వారికి కావాల్సిన సమాచారాన్ని చేరవేస్తూ దేశంపై అంతర్గతంగా ఉంటూ కుట్రలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని అర్బన్ నక్సల్స్ అంటే చాలా మందికి కోపాలు వస్తాయి.
కాలేజీల్లో , విశ్వవిద్యాలయాల్లో కొందరు ప్రొఫెసర్ల ముసుగులో భావజాలం వ్యాప్తి చేసి నక్సల్స్ రిక్రూట్స్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారు, ఉద్యోగాలు చేయిస్తున్నారు. పేద పిల్లలకు మాత్రమే ఇక్కడ వారి బ్రెయిన్లను వాష్ చేసి మావోయిస్టులు ఆలోచనలతో ఆయుధాలు పట్టుకొని వెళ్తమంటున్నారు. ఈ మేధావులు పట్టణాల్లో ఉపన్యాసాలు చెప్పే వీరు వీరి పిల్లలకు ఎందుకు విప్లవ పాఠాలు వారి ఇంట్లో చెప్పడం లేదు?
తమ ఇంట్లో సిద్ధాంతం చెప్పలేని వారు ఇతర పిల్లలకు చెప్పడానికి అర్హత ఉందా అని అడిగితే సమాధానం లేదు. నేను ఓక ప్రముఖ పౌర హక్కులు నేత, మావోయిస్టుల సానుభూతి పరుడు ఉమ్మడి ఆంధ్రలో మావోయిస్టులు-ప్రభుత్వం చర్చల్లో పాల్గొన్న నేతను ఇదే ప్రశ్న అడిగితే వారి నాకు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. మీ కుటుంబం సభ్యులు ఎందుకు ఉద్యమంలో తుపాకీ తీసుకుని మీకు విశ్వాసం ఉన్న సిద్దాంతం వైపు అడవిలోకి వెళ్ల లేదు అని ప్రశ్నిస్తే.. మా పిల్లలు అభిప్రాయం వారి వారి ఇష్టం అని సమాధానం ఇచ్చారు.
తాము బలవంతంగా సిద్ధాంతం రుద్దడం లేదు. వారి ఇష్టాలు వారివి చెప్పుకొచ్చారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సిద్ధాంతాలు చెప్పడానికి మాత్రమే ఆచరించడానికి కాదు. ఇది అర్బన్ నక్సలైట్లుగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు సానుభూతిపరులు ఆలోచనలు. వీరిని నమ్మి అనేకమంది యవత ఈ దారి తప్పిన ఉద్యమం వైపు మొగ్గు చూపుతున్నారు, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
మానవ హక్కుల విషయంలో నక్సలైట్లకు మాత్రమే వీరు నోరు పని చేస్తుంది. నక్సలైట్లు అమాయకులని చంపితే ఒక్కరూ నోరు మెదపరు. అడవుల్లో తిష్ట వేసి అక్కడి గిరిజనుల్ని అడ్డం పెట్టుకుని వారి సాయంతో బతుకుతూ ఇన్ఫార్మర్ల సాయంతో వారినే చంపుతూంటారు నక్సలైట్లు. ఎందుకంటే వారిలో భయం పుట్టించడానికి.!
నక్సలైట్లకు ఆయుధాలు ఖచ్చితంగా విదేశాల నుంచి వస్తున్నాయి. ఒకప్పుడు వీరు చైనా తో పాటు శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈతోనూ అనుబంధంగా ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. విదేశీ శక్తులతో జత కూడి వారి వద్ద ఆయుధాలు తీసుకుని దేశంపై దండెత్తేవారిని ఏమనాలి? వారిని ఉపేక్షిస్తే జరిగే పరిణామాలకు బాధ్యలు ఎవరు ?. నక్సలైట్ల హింసాకాండకు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది బలయ్యారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు, మాధవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి వారిని హతమార్చారు. మొన్నటికి మొన్న గిరిజన ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేశ్వరరావును అంతం చేశారు. అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు వ్యాస్, ఉమేష్ చంద్రతో పాటు మరికొంత మందిని చంపేశారు. అనేకమంది జాతీయవాది విద్యార్థి నాయకులను బలి తీసుకున్నారు. ఉస్మానియాలో యానివర్శిటీలో ఎబివిపి రాష్ట్ర నేత మేరెడ్డి చంద్రారెడ్డిని హాస్టల్ లో బహిరంగంగా చంపేశారు.
విద్యార్థుల్ని చంపడం అనేది ఏం సిద్ధాంతం? దాని వల్ల వారు సాధించిందేమిటి? మావోయిస్టు పార్టీ ఇప్పుడు అంతమయ్యే దశలో ఉంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావును చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ అడవుల్లో హతమార్చాయి. ఇది పెద్ద విజయమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలైట్లు దేశానికి ఎంత చేటు చేస్తున్నారో.. వారిని నిర్మూలించడం ఎంత అవసరమో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల ప్రకటనల వల్ల అర్థం చేసుకోవచ్చు.
భారత్‌లో అంతర్గత తిరుగుబాటుదారులను అంతం చేస్తేనే అతి పెద్ద ముప్పు తప్పుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం 2024 జనవరిలో ప్రారంభించిన ఒక పెద్ద ఎత్తున కౌంటర్-ఇన్సర్జెన్సీ ఆపరేషన్. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పొరుగు రాష్ట్రాలలోని “రెడ్ కారిడార్” ప్రాంతంలో మావోయిస్టు తిరుగుబాటును అణచివేసే లక్ష్యంతో ప్రారంభించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించనున్నారు.
దశాబ్దాలుగా అటవీ ప్రాంతాలను మావోయిస్టులు ఆక్రమించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతం, అబూజ్ మడ, కర్రెగుట్టలు, గడ్చిరోలి (మహారాష్ట్ర), వెస్ట్ సింగ్భూమ్ (జార్ఖండ్), సుక్మా, కాంకేర్, నారాయణపూర్ (ఛత్తీస్‌గఢ్) వంటి ప్రాంతాల నుంచి నక్సలైట్లను నిర్మూలించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్), ఎలైట్ కోబ్రా యూనిట్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్ జి), స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్), రాష్ట్ర పోలీసులు మొత్తం దేశ పౌరుల భద్రత కోసం కాకుండా ఈ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే వీరి కోసం పనిచేస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత తిరుగుబాటుదారుల్ని, వేర్పాటు వాదుల్ని నిర్మూలించేలక్ష్యంతో చేపట్టిన చర్యల వల్ల 2015లో 106 జిల్లాలు నక్సల్ ప్రభావంలో ఉండగా, 2025 నాటికి ఇది 6 జిల్లాలకు చేరింది. ఇప్పుడు బిజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, వెస్ట్ సింగ్భూమ్, గడ్చిరోలిల్లో మాత్రమ నక్సల్స్ ప్రభావం ఉంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత 2024లో 287 మావోయిస్టులు హతమయ్యారు. 2025లో ఇప్పటివరకు 180 మందికిపైగా హతమయ్యారు. వందల మంది లొంగిపోయారు.
ఒకప్పుడు పూర్తి నక్సల్స్ గ్రామంగా ఉన్న బడేసెట్టి పంచాయతీని “నక్సల్-ముక్త పంచాయతీ”గా ప్రకటించారు. అంతే కాదు అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఇప్పటి వరకూ అడ్డుకున్నారు. కానీ అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్రం పట్టాలెక్కించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో 7,768 మొబైల్ టవర్లు, 1,007 బ్యాంక్ బ్రాంచ్‌లు, 937 ఏటీఎంలు, 5,731 పోస్ట్ ఆఫీసులు స్థాపించారు. 48 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, 61 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ,178 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించారు.
స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్ సీఎ) కింద అత్యంత ప్రభావిత జిల్లాలకు సంవత్సరానికి రూ. 30 కోట్లు, ఇతర జిల్లాలకు రూ.10 కోట్లు కేటాయించారు. ఇలా అభివృద్ధి చేస్తూ అక్కడి ప్రజల్ని నక్సల్స్ ప్రభావం నుంచి బయటకు తీసుకు వస్తున్నారు. ప్రజలకు విద్య అందింతే వారు చైతన్యవంతులవుతారన్న ఉద్దేశంతో అడవి బిడ్డలకు విద్య అందకుండా నక్సల్స్ కుట్రలు చేశారు. ఒక్క ఛత్తీస్ ఘడ్లోనే ఐదేళ్లలో రాష్ట్రంలో 131 పాఠశాలలలను నక్సలైట్లు ధ్వంసం చేశారు.
ఒకప్పుడు నక్సలిజం అంటే యువతలో క్రేజ్ ఉండే మాట నిజం. అప్పటి రాజకీయ పరిస్థితులు, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ఉపాధి చూపించలేని ప్రభుత్వాలు, అవినీతి విపరీతంగా ఉండటం వల్ల నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేవారు. ఇలాంటి వారిని అడవుల బాట పట్టించేందుకు పెద్ద పెద్ద వ్యవస్థలు పని చేసేవి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చని నమ్మించేవారు.
కానీ గత పది పన్నెండేళ్ల కాలంలో దేశంలో ఉద్యోగాల విప్లవం వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షణ, మౌలిక సదుపాయాల పెంపు కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువతకు అవకాశాలు పెరిగాయి. యువత కొత్త కొత్త అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారు. నక్సలిజం అనేది అలాంటి అవకాశాలు పెరిగినప్పుడే అంతమయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ నక్సలిజానికి ఆకర్షితులు కావడం లేదు.
గిరిజన గ్రామాల యువకులు కూడా నక్సలిజం పట్ల ఆసక్తిగా లేరు. ప్రభుత్వాలు వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నాయి.ఫలితంగా నక్సలిజం తనకు తానుకు అంతమయిందని అనుకోవచ్చు. నంబాల కేశవరావు తర్వాత అతి కొద్ది మంది టాప్ లీడర్స్ ఇంకా గిరిజనుల్ని అడ్డం పెట్టుకుని దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారు కూడా వృద్ధులు. నిజానికి ఇప్పుడు నక్సలిజం లేదు. నక్సలైట్లే ఉన్నారు.
నక్సలిజం ఎప్పుడో అంతమైపోయింది. మిగిలింది నక్సలైట్లు మాత్రమే. అకారణంగా చంపాలి అనే ఆలోచనలతోనే నక్సల్స్ ఎప్పుడో దారి తప్పారు. అప్పుడే నక్సలిజం అనే భావనకు అంతం ప్రారంభమయింది. ఏదో ఓ సంచలనం కోసం నేతల్ని చంపడం ప్రారంభించారు. ఇది వారి ఉద్యమానికి ఏ విధంగానూ మేలు చేయలేదు సరి కదా పతనానికి, ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అయింది. తర్వాత నక్సలైట్లు ఇన్ఫార్మర్ల పేరుతో సొంత వారిని కూడా చంపుకున్నారు.
గిరిజనుల్ని చంపారు. దాంతో నక్సలిజంపై సానుభూతి నుంచి ప్రజల్లో వ్యతిరేరకత ప్రారంభమయింది. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా మావోయిస్టుల్ని కాల్చి చంపితే మాట్లాడటం లేదు. మిగిలిపోయిన మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఇప్పటికైనా గుర్తించాలి. వారు ముందుగాజన జీవన స్రవంతిలోకి రావాలి. ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయాలి. నక్సలిజం అంటే హత్యలు కాదని.. ప్రజల కోసం ఉపయోగపడే భావజాలం అని ప్రజాస్వామ్యం ద్వారా నిరూపించుకోవాలి.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు