మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం

మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం
మద్యం కుంభకోణంలో మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు. మద్యం విషయంలో సిట్ చాలా విషయాల్లో విచారణ వదిలేసిందని పేర్కొంటూ తాను సిట్‌కు చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి ఎక్కువ జీతాలు చూపించి అందులో వాటాలను జగన్ అండ్ కో కొట్టేశారని ఆయన ఆరోపించారు. 
 
ఒక విజిల్ బ్లోయర్‌గా సిట్‌కు మద్యం కుంభకోణానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని, ఆయన బెదిరింపులకు పాల్పడటంతో నాసిరకం మద్యం అమ్మారని సీఎం రమేశ్ ఆరోపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. 
 
మద్యం కుంభకోణంలో విదేశాలకు పారిపోయిన నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేస్తామని తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణంలో జగన్ పాత్రకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయని, విచారణ ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని రమేశ్ సవాల్ విసిరారు.
రాజధాని నిర్మాణం కోసం 30 నుంచి 40 వేల ఎకరాలు కావాలని గతంలో జగన్ అన్నారని గుర్తు చేస్తూ మరి ఇప్పుడు రాజధాని అమరావతి కోసం 50 వేల ఎకరాలు అవసరమా అని జగన్ ఎలా ప్రశ్నిస్తున్నారని అడిగారు. 
 
కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేసుకోవాలని, పబ్లిక్, ప్రైవేటు రంగ సంస్థలతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జగన్ తన కోసం రూ. 540 కోట్లతో విశాఖపట్నంలో రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్‌తో పాటు బెంగళూరులో కూడా ప్యాలెస్‌లను ఆయన కట్టుకున్నారని చెప్పుకొచ్చారు  రమేశ్.
అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని, చాలా విదేశీ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికే కాకుండా జగన్ చాలా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సెకీ ఒప్పందం విషయంలో జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 
 
పీక్ అవర్లలో విద్యుత్ కోసం చాలా రాష్ట్రాలు యూనిట్‌కు రూ.12ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.4.60 పైసలకు యూనిట్‌ కరెంట్‌ను కొంటుందని రమేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి దేశభక్తి లేదు, కేవలం డబ్బు భక్తి మాత్రమే ఉందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ గురించి జగన్ కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.