ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు మృతి

ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు మృతి

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్‌ రాయబారి అ‌సిమ్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌ సింధు జలాల ఒప్పందం ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తారు. ‘నీరు జీవనానికి ఆధారం. యుద్ధానికి ఆయుధం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు.

భారత్‌ దశాబ్దాలుగా పాక్‌ పెంచి పోషిస్తోన్న ఉగ్రసంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఉగ్రవాద దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు మరణించినట్లు చెప్పారు. ‘ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రం’గా ఉన్న పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.  పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని మండిపడ్డారు.

సింధు జలాల అంశంలో భారత్‌ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్‌ చిత్తశుద్ధితో పాక్‌తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్థాన్‌ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు.  అలాగే, ఒప్పందం జరిగి 65 ఏళ్లు అవుతోందని, కాల క్రమేనా కొన్ని పాత ఆనకట్టలతో భద్రతా సమస్యలు తలెత్తాయని, వాటి మరమ్మతులకు పాకిస్థాన్ అడ్డుకుంటుందని ఐరాస దృష్టికి తీసుకొచ్చారు.

2012లో తుల్​బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా, గత రెండేళ్లుగా ఒప్పందంలో సవరణలపై చర్చించాలని పాకిస్థాన్​ను భారత్ కోరుతోందని ఆయన ఐరాసకు తెలిపారు. కానీ పాకిస్థాన్ మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.  పాకిస్థాన్‌ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగానే 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పర్వతనేని హరీశ్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాద్‌పై విరుచుకుపడ్డారు.  అలాగే ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా పాకిస్థాన్ ప్రభుత్వ, పోలీస్, సైనిక అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు.  ఉగ్రవాదులుస పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి భారత్ ను విమర్శించే అర్హత లేదన్ని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాకిస్థాన్‌ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకూ సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని  పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ ఐరాస ప్రతినిధులను డిమాండ్ చేశారు.