
పోలీసుల సమాచారం ప్రకారం, లతేహార్‌లోని ఇచాబార్ అడవిలో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ చీలిక వర్గమైన ఝార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జేజేఎంపి) చీఫ్ పప్పు లోహ్రా మృతి చెందాడు. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇదే ఎన్కౌంటర్లో మరో జేజేఎంపీ మావోయిస్టు ప్రభాత్ గంజ్ కూడా హతమయ్యారు. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. కాగా, ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఓ మావోయిస్టు సజీవంగా పట్టుబడ్డాడు.
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ భీకర కాల్పుల్లో గాయపడిన స్థితిలో జేజేఎంపికు చెందిన మావోయిస్టు సజీవంగా పట్టుబడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఇన్సాస్ రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ధృవీకరించారు.
కాగా, శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో మావోయిస్టు మృతి చెందాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు