టీమ్‌ ఇండియా టెస్ట్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా గిల్‌

టీమ్‌ ఇండియా టెస్ట్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా గిల్‌
యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ టీమ్ఇండియా కొత్త కెప్టెన్​గా ఎంపికయ్యాడు. తొలి నుంచి ప్రచారం జరినట్లుగానే గిల్​వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. జూన్​లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఇందులో గిల్​కు డిప్యూటిగా రిషభ్‌ పంత్‌ను నియమించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. 
 
33ఏళ్ల కరుణ్ నాయర్​కు ఎట్టకేలకు టీమ్ఇండియా పిలుపు అందింది. గత కొంతకాలంగా దేశవాళీలో అదరగొడుతున్న కరుణ్​ను సెలక్టర్లు ఇంగ్లాండ్ సిరీస్​కు ఎంపిక చేశారు. 2016లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన కరుణ్ 6 మ్యాచ్​లే ఆడాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉంది. అయితే ఆ తర్వాత ఏడాదే 2017లో కరుణ్ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పట్నుంచి టీమ్ఇండియాలో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తే, ఇన్నేళ్లకు అవకాశం దక్కింది.
 
 సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, అర్షదీప్ సింగ్​ ముగ్గురు యంగ్ ప్లేయర్లకు లక్కీ ఛాన్స్ దక్కింది. వీళ్లు తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. 
ఇంగ్లాండ్ సిరీస్​లో వీళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, సాయి సుదర్శన్, అర్షదీప్ ఇప్పటికే టీ20, వన్డేల్లో ఆడినప్పటికీ టెస్టుల్లో అవకాశం ఇదే మొదటిసారి. మరోవైపు, అభిమన్యు టీమ్ఇండియాకు ఎంపికవ్వడం ఇదే తొలిసారి.
 
మరోవైపు, సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాకు మరోసారి నిరాశే మిగిలింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ ఇద్దరికీ అవకాశం వస్తుందని భావించినా సెలక్టర్లు మొండి చేయి చూపారు. రహానే, పుజారా టీమ్ఇండియా తరఫున 2023లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడారు.

ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు సభ్యుల జాబితాను బీసీసీఐ ఇవాళ ప్రక‌టించింది. జట్టులో గిల్‌(కెప్టెన్‌), పంత్‌(వైస్‌ కెప్టెన్‌), యశశ్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్ నాయర్‌‌, నితీశ్ కుమార్‌ రెడ్డి‌, జడేజా, ధ్రువ్‌, వాషింగ్టన్ సుందర్‌‌, శార్దూల్ ఠాకూర్‌‌, బుమ్రా, సిరాజ్‌, ప్రసిద్ధ్ కృష్ణ‌, ఆకాశ్‌దీప్‌, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ ప్యానెల్‌, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఇవాళ సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్ట్‌ల సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు.

భారత జట్టు పర్యటకు ముందు ఇంగ్లాండ్‌ ఏ జట్టు ఇంగ్లాండ్‌ లయన్స్‌తో రెండు టెస్టులు ఆడనున్నది. ఈ మ్యాచుల కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన తొమ్మిది మంది ప్లేయర్స్‌ సీనియర్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ఇందులో శుభ్‌మన్‌ గిల్‌తో పాటు సాయి సుదర్శన్‌ సైతం ఉన్నారు.