కేసీఆర్ కు లేఖ వ్రాసాను.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి!

కేసీఆర్ కు లేఖ వ్రాసాను.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి!
 
* కవిత రాగానే ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు 
 
“కెసిఆర్‌కు లేఖ రాసింది నేనే…తెలంగాణలో ప్రజలు అనుకుంటున్న విషయాలే అందులో చెప్పాను.. నాకు పర్సనల్ అజెండా ఏమీ లేదు.. ఆ లేఖను బహిర్గతం ఎవరు చేశారు. దాని వెనకాల ఎవరున్నారో అర్థం చేసుకోవాలి. పార్టీలోని కొందరు కోవర్టులే ఆ లేఖను లీక్ చేశారు. పార్టీని పటిష్టం చేయాలనేది నా ఉద్దేశం. కెసిఆర్ దేవుడు. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయి” అంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బయటకు రాగానే ‘సీఎం సీఎం’ అంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో అమెరికా నుండి తిరిగి రాగానే శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ అయితే, అందులో ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని ఆమె తెలిపారు.  “రెండు వారాల క్రితమే నేను మా నాయకుడు కేసీఆర్ కి లేఖ రాశాను. ఇలాంటి లేఖలు రాయ‌డం ఇది మొదటిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలానే పర్సనల్‌గా లేఖలు రాసాను. కానీ ఈసారి అది బయటకు రావడం బాధాకరం” అని కవిత తెలిపారు.

లేఖ లీక్ అయిన విషయాన్ని తీవ్రంగా అభివర్ణించిన కవిత, పార్టీ అంతర్గతంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా దీన్ని లీక్ చేశారని ఆరోపించారు. “లేఖ బహిర్గతం వెనుక కుట్ర ఉంది. దాని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఇది పార్టీని బలహీనపరిచే ప్రయత్నం” అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆ లేఖలో త‌ను పార్టీ నాయకుల అభిప్రాయాలను మాత్రమే రాశానని కవిత చెబుతున్నారు.

తన నాయకుడు కేసీఆర్ పట్ల అపారమైన భక్తి, నమ్మకం ఉన్నదని స్పష్టం చేసిన కవిత, “కేసీఆర్ మా దేవుడు లాంటి వారు. కానీ ఆయన చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నాయి. పార్టీ, కుటుంబం ఐక్యంగా ఉన్నాం. దీనిని దెబ్బతీసే ప్రయత్నాలు కొందరి కుట్రలు మాత్రమే” అని ఆరోపించారు.

తన అభిప్రాయాలను, పార్టీ ప్లీనరీ సభ నిర్వహణ, భవిష్యత్ వ్యూహాలపై తనకున్న ఆలోచనలను లేఖ ద్వారా కేసీఆర్‌కు తెలియజేశానని ఆమె తెలిపారు. గతవారం రోజులుగా ఈ లేఖ బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది. లేఖ లీక్ అయిన తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంపై నేరుగా స్పందించడానికి మొఖం చాటవేయడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. 
ముఖ్యంగా.. లేఖలో కవిత బీజేపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు ఈ లేఖను బీఆర్‌ఎస్ లోపల ఉన్న అసంతృప్తికి, నాయకత్వ మార్పులపై ఉన్న భిన్నాభిప్రాయాలకు సంకేతంగా చూశారు. కవిత స్వయంగా లేఖను ధ్రువీకరించడంతో, ఇకపై ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 
 
పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిర్గతం కావడం, అందునా ఒక కుటుంబ సభ్యురాలి ద్వారా జరగడం బీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించవచ్చు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. కవితకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి కార్యకర్తల తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గులాబీ రంగు జెండాలు, కండువాలతో వచ్చే బీఆర్‌ఎస్ కార్యకర్తలకు భిన్నంగా, జాగృతి కార్యకర్తలు నీలి రంగు కండువాలను ధరించారు. 
 
అంతేకాకుండా, స్వాగతం పలికే బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు లేకుండా కేవలం కవిత పేరుతో మాత్రమే దర్శనమిచ్చాయి. బీఆర్‌ఎస్ పార్టీ పేరు కూడా ఎక్కడా కనిపించకుండా కటౌట్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. టీమ్ కవితక్క అంటూ బ్యానర్లు కూడా కనిపించాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఒక్కరు కూడా ఆమెకు స్వాగతం పలికేందుకు రాకపోవడం విశేషం.